ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్‌ ఓటమి: కాంగ్రెస్‌ సమిష్టి వైఫల్యమే !

March 06, 2025


img

ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్‌కు బీజేపి పెద్ద షాక్ ఇచ్చింది. కాంగ్రెస్‌ సిట్టింగ్ స్థానంగా ఉన్న ఉమ్మడి కరీంనగర్-మెదక్-అదిలాబాద్-నిజామాబాద్‌ జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ సీటుని బీజేపి అభ్యర్ధి అంజిరెడ్డి గెలుచుకున్నారు.  కాంగ్రెస్‌ అభ్యర్ధి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డిపై 5,106 ఓట్లు తేడాతో అంజిరెడ్డి విజయం సాధించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపికి చెందిన మల్క కొమరయ్య గెలిచారు. కనుక ఉత్తర తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ పదవులు బీజేపి సొంతం చేసుకోవడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు. 

ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా ప్రసన్న హరికృష్ణ పోటీ చేస్తారని ముందు నుంచి చెప్పారు. ఆయన కూడా చాలా కాలంగా నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. కానీ చివరి క్షణంలో ఆయనని పక్కన పెట్టి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని అభ్యర్ధిగా ప్రకటించడంతో ప్రసన్న హరికృష్ణ వెంటనే బీఎస్పీలో చేరి పోటీ చేశారు. ఆయనకు టికెట్ ఇవ్వకపోవడం, ఆయన పోటీ చేసి ఓట్లు చీల్చడం వల్లనే కాంగ్రెస్‌ పార్టీ ఈ ఎన్నికలలో ఓడిపోయింది.      

కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు  గెలుచుకున్న ఎమ్మెల్సీ సీటుని అధికారంలోకి వచ్చిన తర్వాత కోల్పోవడం ఆ పార్టీ నేతల సమిష్టి వైఫల్యంగానే భావించవచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఈ నాలుగు జిల్లాలలో ఏడుగురు మంత్రులు, 23 మంది ఎమ్మెల్యేలున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గంలో రెండుసార్లు పర్యటించి ఎన్నికల ప్రచారం చేశారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మహేష్ కుమార్‌ గౌడ్‌ పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నారు. ఇంతమంది ఉన్నా కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్సీ సీటుని బీజేపికి కోల్పోయిందంటే ఇది సమిష్టి వైఫల్యమే కదా?   



Related Post