తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్ ఈరోజు ఢిల్లీ నుంచి రైల్లో కాచిగూడ రైల్వేస్టేషన్ చేరుకున్నారు. ఆమెకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సాధారంగా స్వాగతం పలికి గాంధీ భవన్‌కు తోడ్కొని వెళ్ళారు. అయితే అక్కడ ఆమెకు స్వాగతం పలుకుతూ పెద్ద ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేయడంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు.
ఆ తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా ఆమెకు అభినందనలు తెలిపి పెద్దపెద్ద పూల బొకేలతో క్యూకట్టడాన్ని కూడా ఆమె ఆక్షేపించారు. తనకు స్వాగతం పలికేందుకు ఇంత హడావుడి ఎందుకు చేస్తున్నారని ఆమె వారిని ప్రశ్నించారు. ఇకపై గాంధీ భవన్‌లో ఫ్లెక్సీ బ్యానర్లు, కటవుట్లు పెట్టవద్దని ఆమె కాంగ్రెస్ నేతలకు సూచించారు.
ఆనంతరం ఆమె పార్టీ ముఖ్య నాయకులను పరిచయం చేసుకొని తెలంగాణ ప్రదేశ్ కమిటీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.
సాధారణంగా కాంగ్రెస్‌తో సహా ఏ పార్టీ నాయకులైణా హైదరాబాద్-ఢిల్లీకి విమాణాలలో రాకపోకలు సాగిస్తుంటారు. కానీ ఇంత కీలక పదవిలో నియమితులైన మీనాక్షి నటరాజన్ ఢిల్లీ నుంచి రైలులో రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆమె నిరాడంబరంగా ఉండాలనుకుంటున్నా హైదరాబాద్, ఢిల్లీ మద్య తరచూ తిరగాల్సి ఉంటుంది కనుక ఇకపై విమానాలలోనే తిరుగక తప్పదు.
ఇక రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టక ముందే, గాంధీ భవన్ వద్ద ఫ్లెక్సీలు, కటవుట్స్ పెట్టవద్దని ఆదేశించడం గమనిస్తే ఆమె రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు కాస్త భిన్నంగా రాజకీయాలు చేయబోతున్నట్లు భావించవచ్చు. కానీ వస్తూనే ఆమె సీనియర్ నేతలకు క్లాస్ పీకినందున వారు ఆమెతో ఏవిదంగా వ్యవహరిస్తారో?