కాంగ్రెస్‌-బీజేపి-బిఆర్ఎస్: ఎప్పుడూ మూడు ముక్కలాటలేనా?

February 25, 2025


img

తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎన్నికలొచ్చినా కాంగ్రెస్‌, బీజేపిలు కుమ్మక్కు అయ్యాయని బిఆర్ఎస్, బీజేపి, బిఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని కాంగ్రెస్, కాంగ్రెస్‌, బిఆర్ఎస్ కుమ్మక్కయాయని బీజేపి ఆరోపిస్తుండటం పరిపాటిగా మారిపోయింది. రాష్ట్రంలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగబోతున్నాయి కనుక మళ్ళీ మూడు ముక్కలాట మొదలైంది. 

సిఎం రేవంత్ రెడ్డి సోమవారం మంచిర్యాలలో  కాంగ్రెస్‌ పట్టభద్ర ఎమ్మెల్సీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు, ఫోన్ ట్యాపింగ్, ఎఫ్-1 రేసింగ్ కేసులలో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావులను కేంద్ర ప్రభుత్వమే కాపాడుతోందని సంచలన ఆరోపణలు చేశారు. 

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులైన ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికాలో దక్కున్నారని, వారిని హైదరాబాద్‌ రప్పించేందుకు సహకరించమని తాను స్వయంగా ప్రధాని మోడీకి లేఖ వ్రాసినా పట్టించుకోలేదని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

ఎఫ్-1 రేసింగ్ కేసులో కేటీఆర్‌ని అరెస్ట్‌ చేయబోతుంటే మద్యలో ఈడీ వచ్చి దానికి సంబందించిన ఫైల్స్ అన్నీ పట్టుకుపోయి కేటీఆర్‌ని కాపాడిందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కేసుల కోసమే కేటీఆర్‌, హరీష్ రావు ఇద్దరూ ఢిల్లీ వెళ్ళివస్తుంటారని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

ఈ కేసులలో కేంద్రం జోక్యం చేసుకొని కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావు ముగ్గురినీ కాపాడుతోందని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అమెరికా నుంచి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను హైదరాబాద్‌కు ఎందుకు రప్పించడం లేదో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ చెప్పాలని సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.     

బిఆర్ఎస్-బీజేపిల మద్య రహస్య అవగాహన  ఉన్నందునే రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు రాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు బిఆర్ఎస్ పార్టీ దూరంగా ఉన్నందున కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావు, బిఆర్ఎస్ నేతలు ఏ పార్టీ అభ్యర్ధికి ఓట్లు వేస్తారో చెప్పాలని సిఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. 


Related Post