కేసీఆర్‌ అజ్ఞాతవాసం సమాప్తం?

February 19, 2025


img

ఆనాడు పాండవులు అరణ్యవాసం పూర్తి చేసుకున్నాక ఏడాది పాటు విరాట మహారాజు కొలువులో ఏడాది పాటు అజ్ఞాతవాసం కూడా పూర్తిచేసుకొని బయటకు వచ్చారు. అలాగే కేసీఆర్‌ కూడా 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించి ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ఏడాది పాటు తన ఫామ్‌హౌస్‌లో అజ్ఞాతవాసం చేసి బుధవారం మద్యాహ్నం బయటకు వస్తున్నారు. 

ఈరోజు మద్యాహ్నం ఒంటి గంటకు తెలంగాణ భవన్‌లో బిఆర్ఎస్ పార్టీ విస్తృతస్తాయి సమావేశం జరుగనుంది. దానిలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర కార్యవర్గం సభ్యులు, ముఖ్య నేతలు, స్థానిక సంస్థల సభ్యులు అందరూ పాల్గొంటారు. బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు హోదాలో కేసీఆర్‌ వారితో సమావేశమై రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి, ఎదుర్కొంటున్న సవాళ్ళు, కాంగ్రెస్‌ ఏడాది పాలన, బిఆర్ఎస్ పార్టీ భవిష్య కార్యాచరణ తదితర అంశాలపై చర్చించి, పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌ రేవంత్ రెడ్డి పాలన, ప్రభుత్వం పనితీరుపై తీవ్ర విమర్శలు చేయడం, వాటికి రేవంత్ రెడ్డితో సహా కశ మంత్రులు ఘాటుగా బదులివ్వడం రెండూ ఖాయమే. 

కేసీఆర్‌ ఇక నుంచి ఎప్పటిలాగే పూర్తి సమయం రాజకీయాలలో ఉంటారా లేక మళ్ళీ ఫామ్‌హౌస్‌లోకి వెళ్ళిపోతారా? అనేది మరికొన్ని గంటలలో తెలుస్తుంది.

ఒకవేళ ఆయన పూర్తి సమయం రాజకీయాలలో గడపాలని భావిస్తే రాష్ట్ర రాజకీయాలు మళ్ళీ వేడెక్కుతాయి. ఇప్పటి వరకు కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీల మద్య చిన్నగా జరుగుతున్న రాజకీయ యుద్ధాలు ఇకపై హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది.


Related Post