కేంద్రప్రభుత్వానికి సుప్రీంకోర్టు హెచ్చరిక

November 18, 2016


img

నోట్లు రద్దు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని ఈరోజు విచారణకి చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్. ఠాకూర్ చేతులు కాలకముందే మేల్కొనాలని కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్రప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం వలన సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్య ఇంకా ఇలాగే ఇంకా ఎక్కువ కాలం కొనసాగితే అల్లర్లు మొదలవవచ్చని, కనుక అ పరిస్థితి రాక ముందే ఈ సమస్య పరిష్కారం కోసం అవసరమైన అన్ని చర్యలని వేగంగా తీసుకోవాలని కోరారు. 

కేంద్రప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహాత్గీ వాదిస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల హైకోర్టులలో దాఖలవుతున్న పిటిషన్లపై హైకోర్టులు విచారణ చేపట్టకుండా స్టే విదించవలసిందిగా కోరగా సుప్రీంకోర్టు తిరస్కరించింది. వీలైతే హైకోర్టులలో దాఖలవుతున్న అన్ని పిటిషన్లని సుప్రీంకోర్టుకి బదిలీ చేసి అన్నిటినీ కలిపి విచారిస్తామని జస్టిస్ టి.ఎస్. ఠాకూర్ తెలిపారు. 

నేటి నుంచి నోట్ల మార్పిడి పరిమితిని రూ.4,500 నుంచి రూ.2,000 కుదించడంపై ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకపక్క దేశ ప్రజలు అందరూ నోట్లు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, కేంద్రప్రభుత్వం వారి బాధలని తీర్చకపోగా ఇంకా ఎక్కువ చేస్తోందని అభిప్రాయపడ్డారు. నోట్ల మార్పిడి పరిమితిని మళ్ళీ ఎందుకు కుదించారని ప్రశ్నించారు. 

ప్రభుత్వం వద్ద అవసరమైనన్ని నోట్లు సిద్దంగా ఉన్నాయని కానీ వాటిని బ్యాంకులకి తరలించడంలోనే ఆలస్యం అవుతోందని ముకుల్ రోహాత్గీ జవాబు చెప్పారు. అదీ ఒక కారణమే అయినప్పటికీ అసలు కారణం మాత్రం వేరే ఉందని అందరికీ తెలుసు. 

నల్లధనం ఉన్నవారు ఈ వెసులుబాటుని ఉపయోగించుకొని దినసరి కూలీలని నియమించుకొని తమ వద్ద ఉన్న డబ్బుని వైట్ గా మార్చుకొంటున్నారని కేంద్రప్రభుత్వం గ్రహించడంతో దానిని నివారించడానికే నోట్లు మార్పిడి చేసుకొంటున్న వ్యక్తులు వేలిపై ఇంకు గుర్తు వేయడం, నోట్ల మార్పిడి పరిమితిని మళ్ళీ కుదించడం వంటి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కానీ నోట్ల మార్పిడి పరిమితిని తగ్గించడంతో అది ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపినట్లు అయింది. నోట్ల కొరత ఉందని ప్రజలు భావించేలా చేసింది. దానితో ప్రజలు అవసరమున్నా లేకపోయినా అవకాశం దొరికినప్పుడల్లా తమ అకౌంట్ల నుంచి డబ్బుని విత్ డ్రా చేసుకోవడం మొదలుపెట్టారు. అది పరిస్థితిని ఇంకా జటిలం చేస్తోంది. దానితో నోట్లు అందని వారిలో ఆగ్రహావేశాలు కనబడుతున్నాయి. కనుక ఇవే పరిస్థితులు ఇంకా ఎక్కువ రోజులు కొనసాగితే ప్రజలు ఆగ్రహావేశాలు ఉద్యమరూపం దాల్చే ప్రమాదం ఉంటుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. మరి కేంద్రప్రభుత్వం చేతులు కాలకముందే మేల్కొంటే మంచిది కదా!


Related Post