మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ, తిరుమలలో తెలంగాణ భక్తులు, తెలంగాణ ప్రముఖుల పట్ల టీటీడీ వివక్ష చూపుతోందని ఆరోపించారు.
దీనిపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెంటనే స్పందిస్తూ, “తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా సంహించేదేలేదు. తిరుమల పవిత్ర క్షేత్రం. ఇది రాజకీయ వేదిక కాదు. ఎవరు రాజకీయంగా తిరుమలను వేదికగా చేసుకున్నా చర్యలు తప్పవని గతంలోనే హెచ్చరించడం జరిగింది.
తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో వెనుకడుగు వేయకూడదనే మా పాలకమండలి తొలి సమావేశంలోనే ప్రత్యేక ఎజెండాగా ఈ విషయాన్ని చర్చించి నిర్ణయం తీసుకున్నాం. తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేసేవారు ఎంతటివారైనా సరే ఉపేక్షించేదే లేదు. తెలంగాణకు చెందిన ఒక నేత తిరుమల వేదికగా రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. అతనిపై చర్యలకు ఆదేశిస్తున్నాం,” అని ట్వీట్ చేశారు.
తిరుమల కొండపై ఎవరూ రాజకీయాలు మాట్లాడరాదని టీటీడీ నిర్ణయించినప్పుడు దానికి అందరూ కట్టుబడి ఉండాలి. కానీ ఉండరని శ్రీనివాస్ గౌడ్ నిరూపించారు. కనుక ఆయనపై చర్యలు తీసుకుంటామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చెప్పడం సమంజసమే. కానీ చర్యలు తీసుకోగలరా? అంటే అనుమానమే.
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నాయకులు వస్తుంటారు. వారిలో ప్రతిపక్ష నాయకులు కూడా ఉంటారు. కనుక వారు కొండపై రాజకీయాలు మాట్లాడకుండా ఉండరు.
కనుక మాట్లాడిన ప్రతీ ఒక్కరిపై టీటీడీ చర్యలు తీసుకోగలదా? తీసుకుంటే అదో కొత్త సమస్యగా మారి దాంతో మళ్ళీ ఆంధ్రా-తెలంగాణ రాజకీయాలు మొదలవుతాయి.
కనుక తిరుమల కొండపై మీడియాని అనుమతించకుండా ఉంటే రాజకీయ నాయకులకు మాట్లాడే అవకాశం ఉండదు కదా? ఇంత సులువైన పరిష్కారం ఉండగా చర్యలు అంటూ కొత్త సమస్యలు సృష్టించుకోవడం దేనికి?