లగచర్ల: బిఆర్ఎస్‌ పైచేయి సాధించిందే!

December 18, 2024


img

లగచర్ల దాడి కేసులో బిఆర్ఎస్‌ కార్యకర్త సురేష్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ ఈ కేసులో బిఆర్ఎస్‌ చిక్కుకున్నట్లు కనిపించింది. కానీ ఆ కేసులో అరెస్ట్‌ అయిన హీర్యా నాయక్‌ అనే రైతుని పోలీసులు అతని చేతికి గొలుసులు, బేడీలు వేసి హాస్పిటల్ తరలిస్తున్న ఘటన బయట పడటంతో దానిని బిఆర్ఎస్ పార్టీ తెలివిగా అందిపుచ్చుకొని నిన్న శాసనసభలో రేవంత్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టగలిగింది. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు ధరించి చేతులకు బేడీలతో నిరసనలు వ్యక్తం చేస్తూ శాసనసభలో ప్రవేశించి రచ్చరచ్చ చేస్తుంటే కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు వారిని అడ్డుకోవడంలో విఫలమయ్యారు. 

ఒకవేళ రైతుకి బేడీల ఘటన జరగకుండా ఉండి ఉంటే శాసనసభలో కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలను ఎదుర్కోవడానికి బిఆర్ఎస్ పార్టీ చాలా ఇబ్బంది పడి ఉండేది. కానీ ఈ ఘటనతో బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలే కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని శాసనసభలో గట్టిగా నిలదీశారు. అంటే లగచర్ల దాడి కేసులో బిఆర్ఎస్ పార్టీ దెబ్బ తింటుందని అనుకుంటే, కాంగ్రెస్ పార్టీ ఎదురుదెబ్బ తినడం విశేషం. 

అయితే రెండు పార్టీలు కూడా లగచర్ల రైతుల సమస్యలని పరిష్కరించే ఆలోచన చేయకుండా ఈ అంశంతో ఒకరిని ఒకరు రాజకీయంగా దెబ్బ తీసుకునేందుకు, ఒకరిపై మరొకరు రాజకీయంగా పైచేయి సాధించేందుకు మాత్రమే ఉపయోగించుకోవడం బాధాకరం.


Related Post