నోట్ల రద్దుపై కేసీఆర్ వ్యూహం ఏమిటంటే

November 17, 2016


img

నోట్ల రద్దుతో రాష్ట్రం నెలకి రూ.2,000 కోట్లు వరకు ఆదాయం కోల్పోతున్నట్లు మంత్రి కేటిఆర్ స్వయంగా చెప్పారు. కేంద్రం నుండి రాష్ట్రానికి రావలసిన నిధులు కూడా సకాలంలో అందకపోవడంతో ఆర్ధిక ఇబ్బందులు ఇంకా పెరిగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఈ సమస్యల కారణంగానే నోట్ల రద్దు నిర్ణయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ కారణంగా కేంద్రప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకూడదని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అందుకే నిన్నటి నుంచి మొదలైన పార్లమెంటు శీతాకాల సమావేశాలలో తెరాస ఎంపిలు కేంద్రప్రభుత్వానికి అండగా నిలబడాలని ముఖ్యమంత్రి  కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. 

నోట్ల రద్దు కారణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గాడి తప్పకుండా జాగ్రత్తపడమని అన్నిశాఖల అధికారులకి తగిన సూచనలు చేసి, ఎప్పటికప్పుడు పరిస్థితులు తనకి నివేదించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అన్ని మంత్రిత్వ శాఖల నుంచి రోజువారి నివేదికలు కూడా తెప్పించుకొంటూ, పరిస్థితులని బట్టి తగిన నిర్ణయాలు తీసుకొంటున్నారు. 

నవంబర్ 25న ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ వస్తున్నారు. ఆ సందర్భంగా ఆయనని కలిసి ఈ నివేదికల ఆధారంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులని వివరించి, ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి రాష్ట్రానికి ఆర్ధిక సహాయం చేయవలసిందిగా కోరనున్నారు. అంటే కేసీఆర్ కేంద్రప్రభుత్వంతో  ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో వ్యవహరించాలని నిశ్చయించుకొన్నట్లు చెప్పవచ్చు. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న కేంద్రంతో ఈ సమయంలో గొడవలు పడటం కంటే సానుకూలంగా వ్యవహరిస్తూ సహాయం పొందడమే విజ్ఞత కనుక కేసీఆర్ అనుసరిస్తున్న ఈ వ్యూహం సత్ఫలితాలు ఇవ్వవచ్చు.  

అయితే ఈ సమస్య ఒక్క తెలంగాణాదే కాదు. నోట్ల రద్దుతో ఆర్ధికంగా బలంగా ఉందనుకొన్న తెలంగాణా పరిస్థితే తారుమారు అయితే పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ తో సహా దేశంలో అన్ని రాష్ట్రాల పరిస్థితి అందుకు భిన్నంగా ఉండబోదు కనుక అన్ని రాష్ట్రాలు కేంద్రప్రభుత్వం నుంచి బారీగా ఆర్ధిక సహాయం ఆశించవచ్చు. వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి దేశ వ్యాప్తంగా జి.ఎస్.టి.పన్నువిధానం కూడా అమలులోకి రాబోతోంది. దాని వలన కూడా అన్ని రాష్ట్రాలు ఆదాయం కోల్పోతాయి కనుక కేంద్రంపై ఇంకా ఎక్కువగా ఆధారపడవలసి వస్తుంది. ఆ నష్టాన్ని కేంద్రప్రభుత్వమే భరించబోతోంది కనుక దానిపై చాలా ఆర్ధిక భారం పడటం ఖాయం. 

ఈ నోట్ల రద్దు కారణంగా దేశ, రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థలలో పెద్ద కుదుపులు వచ్చినప్పటికీ దాని కారణంగానే రానున్న రోజులలో ఆర్ధిక వ్యవస్థ చాలా బలపడే అవకాశం ఉందని ఆర్ధిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు నోట్ల రద్దు, జి.ఎస్.టి.పన్నువిధానం వలననే కేంద్రప్రభుత్వం ఆదాయం చాలా బారీగా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయ పడుతున్నారు. కనుక అది తట్టుకోగలదని ఆర్ధిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సంధికాలంలో ఎదురవుతున్న ఈ సమస్యలన్నిటినీ దేశ ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రప్రభుత్వం అందరూ కలిసికట్టుగా ఎదుర్కోగలిగితే వాటి నుంచి తొందరగా బయటపడి అభివృద్ధి సాధించవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.



Related Post