తమిళనాడులో అమ్మ సెంటిమెంటు

November 14, 2016


img

సినిమాలలో అమ్మ, అక్క, భర్త, కొడుకు, తమ్ముడు ఇలాగ రకరకాల సెంటిమెంటులు ఉన్నట్లే, రాజకీయాలలో కూడా సానుభూతి సెంటిమెంటు ఒకటి ఉందని అందరికీ తెలుసు. అనారోగ్యంతో ఆసుపత్రిపాలైన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇప్పుడు అటువంటి సానుభూతి సెంటిమెంటునే తెలివిగా ఉపయోగించుకొంటున్నారు. ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడిన ఆమె సోమవారం సాయంత్రం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. కానీ అంతకంటే ముందుగానే ఆమె పేరిట ప్రజలకి ఒక బహిరంగ లేఖని అన్నాడిఎంకె పార్టీ విడుదల చేసింది. దానిలో తన ఆరోగ్యం కోసం ప్రార్ధనలు చేసిన ప్రజలందరికీ ఆమె కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. ఇది తనకి పునర్జన వంటిదని ఆ ఆనంద క్షణాలని ప్రజలతో పంచుకొనేందుకు చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నానని ఆమె వ్రాశారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ లేఖలో జోడించిన మరొక రెండు లైన్లు రాజకీయ సెంటిమెంటు వాసన వెదజల్లుతున్నాయి. 

ఈ నెల 19వ తేదీన తంజావూరు, తిరుప్పరం కుండ్రం, అరవ కురిచ్చి, పుదుచ్చేరి నియోజక వర్గాలలో ఉప ఎన్నికలు జరుగబోతున్నాయి. వాటిలో అన్నాడిఎంకె పార్టీకి విజయం అందించాలని ఆమె తన లేఖలో కోరారు. ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ప్రజల ముందుకు వచ్చి ఆ విజ్ఞప్తి చేయవచ్చు. కానీ ఆసుపత్రిలో ఉండగానే ఆమె లేఖ ద్వారా తమ పార్టీని గెలిపించాలని కోరడం దేనికంటే ప్రజలలో నెలకొన్న సానుభూతిని సొమ్ము చేసుకోవాలనుకోవడం కోసమేనని చెప్పవచ్చు. ఒకవేళ ఆమె పూర్తిగా కోలుకొని ఎన్నికల ప్రచారంలో పాల్గొనగలిగితే, అప్పుడు ఈ సెంటిమెంటు ఇంత బలంగా పనిచేయదు. అదే అనారోగ్యంతో మంచం మీద ఉన్నప్పుడే విజ్ఞప్తి చేస్తే ప్రజలలో సానుభూతి ఇంకా పెరుగుతుంది. అది ఓట్ల రూపంలోకి మారుతుందని వేరే చెప్పనవసరం లేదు. ఇంతకాలం ఆమె మృత్యువుతో పోరాడి చివరికి గెలిచినందుకు రాష్ట్ర ప్రజలలో ఎలాగూ ఆమెపై సానుభూతి ఉంటుంది. కనుక అది ఓట్లు రూపంలో మారడం తధ్యమే. జయలలిత లేఖ ద్వారా చేసిన విజ్ఞప్తి దానిని ఖరారు చేస్తుంది అంతే!


Related Post