తెలంగాణ రాష్ట్రంలో నిర్మితమైన, ఇంకా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, పంప్ హౌస్‌లు నీళ్ళ నిలువకు, పంపింగ్‌కి ఉపయోగపడకపోయినా కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు రాజకీయాలకు మాత్రం బాగా ఉపయోగపడుతున్నాయని చెప్పవచ్చు.
ఇందుకు తాజా ఉదాహరణగా సుంకీశాల ప్రమాదంపై ఆ రెండు పార్టీల మద్య రాజకీయాలు కనిపిస్తున్నాయి. తమ ప్రభుత్వం హైదరాబాద్‌కు తాగునీటి సమస్యని శాస్వితంగా తీర్చేందుకు ఈ ప్రాజెక్టు చేపడితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దానిని నిర్లక్ష్యం చేసింది. అందువల్లే ఈ ప్రమాదం జరిగింది. అందుకే ఈ ప్రమాదం విషయం బయటకు పొక్కకుండా ఇన్నాళ్ళు దాచిపెట్టిందని కేటీఆర్ విమర్శించారు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనమే అని కేటీఆర్ అన్నారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, “బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే కమీషన్లకు కక్కుర్తిపడిందని ఇంతకాలం అనుకుంటున్నాము. కానీ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుని వదలలేదని ఇప్పుడు స్పష్టమైంది. దీనిపై విచారణ జరిపించి నిజానిజాలు బయటపెడతాము,” అని అన్నారు.