బంగ్లాదేశ్ ప్రధాని హసీనా రాజీనామా... భారత్‌లో ఆశ్రయం

August 06, 2024


img

పొరుగుదేశం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చేశారు. రిజర్వేషన్ల విషయంలో గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. అవి ఉదృతస్థాయికి చేరుకోవడంతో, మిలటరీ జనరల్ వాకర్-ఉజ్-జమాన్ ఆమెను తక్షణం రాజీనామా చేసి పదవిలో నుంచి తప్పుకోవాలని ఆదేశించారు. 

పరిస్థితులు అంతకంతకూ విషమిస్తుండటం సోమవారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి ప్రత్యేక విమానంలో ఢాకా నుంచి యూపీలోని ఘజియాబాబాద్, హిండన్ విమానాశ్రయం చేరుకున్నారు. కొద్ది సేపటికే ఆందోళనకారులు ఆమె అధికార నివాసం గణభవన్‌లో ప్రవేశించి, విధ్వంసం సృష్టించి ఆమె చీరలు, ఫర్నీచర్, తదితర విలువైన వస్తువులను ఎత్తుకుపోయారు. 

మిలటరీ జనరల్ జమాన్ అధ్యక్షతన తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునః సమీక్షిస్తానని కనుక ఆందోళనకారులు శాంతించాలని విజ్ఞప్తి చేశారు. 

కేంద్ర ప్రభుత్వం షేక్ హసీనా, ఆమె సోదరి షేక్ రెహనాలను ఢిల్లీలో ఓ రహస్య ప్రదేశంలో ఉంచి వారికి భద్రత కల్పించింది. వారిరువురూ లండన్‌ వెళ్లిపోయే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. భారత్‌ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆమెను కలిసి ప్రస్తుత పరిస్థితులలో బంగ్లాదేశ్ విషయంలో భారత్‌ వైఖరి ఏవిదంగా ఉండబోతోందో వివరించి, ఆమెకు భారత్‌ ప్రభుత్వం పూర్తి భద్రత కల్పిస్తుందని చెప్పిన్నట్లు సమాచారం.


Related Post