తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది బలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ ప్రజలందరూ కలిసికట్టుగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటికీ పదేళ్ళు పూర్తయ్యాయి.
అయితే ఆనాడు తెలంగాణ సాధన కోసం అన్ని పార్టీలు, ప్రజలందరూ ఏకమై పోరాడగా, కేవలం పదేళ్ళలో రెండుగా చీలిపోయి, ఎవరి వేడుకలు వారివే అన్నట్లు నిర్వహించుకోవడం చాలా బాధాకరమే.
గత పదేళ్ళుగా బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ వేడుకలలో ఏనాడూ ప్రతిపక్షాలను కలుపుకుపోలేదు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానించినా కలిసి రావడం లేదు!
మా వల్లనే తెలంగాణ ఏర్పడిందని చెప్పుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప ఆ ఉద్యమ స్ఫూర్తిని, ఐక్యతని కేసీఆర్ మరిచిపోయిన్నట్లే ఉన్నారు.
నాడు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చొరవ వలననే తెలంగాణ ఏర్పడిందని, ఆమెకు సదా రుణపడి ఉంటామని శాసనసభలో చెప్పిన కేసీఆర్ నేడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో పాల్గొనేందుకు ఇష్టపడటం లేదు.
తెలంగాణ సాధించిన క్రెడిట్ పూర్తిగా తనదే అని రాష్ట్ర ప్రజలకు నొక్కి చెప్పేందుకు బిఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో వేరేగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు.
నాడు సకుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీతో ఫోటో దిగి తెలంగాణ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకున్న కేసీఆర్, నేడు నగరంలోనే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు నిర్వహిస్తుంటే ఆహ్వానించినా మొహం చాటేస్తున్నారు.
తెలంగాణ కోసం అవసరమైతే బొద్దెపురుగుని కూడా ముద్దాడటానికి వెనకాడనని చెప్పిన కేసీఆర్, నేడు తనను అధికారానికి దూరం చేసినందుకు కాంగ్రెస్ పార్టీని, సిఎం రేవంత్ రెడ్డిని చూస్తే మండిపడుతున్నారు.
పదేళ్ళలోనే పార్టీల మద్య, ప్రజల మద్య ఇంతగా విభజన జరిగింది? దీనికి ఎవరు కారణం? అంటే కేసీఆర్ అనే చెప్పక తప్పదు.
తెలంగాణ ఉద్యమాల కోసం అందరినీ కలుపుకుపోయిన కేసీఆర్, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫక్తూ రాజకీయ నాయకుడుగా మారిపోయి రాష్ట్రంలో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసి, తెలంగాణ అంటే బిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ మాత్రమే అనే భావన కల్పించేందుకు ఏమేమి చేయాలో అన్నీ చేశారు.
రాష్ట్రాన్ని గులాబీమయం చేసి ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్షాలను, ప్రజలను, మీడియాని గౌరవించకుండా నేనే రాజు... నేనే మంత్రి అన్నట్లు నిరంకుశంగా పరిపాలించారు. బిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకునే క్రమంలో తెలంగాణ ప్రజలను నిలువునా చీల్చడానికి కూడా వెనకాడలేదు.
ఈ కారణంగానే ఆనాడు కలిసికట్టుగా పోరాడిన ప్రజలు కూడా పదేళ్ళలోనే పార్టీల మద్య చీలిపోయి, ప్రజలుగా ఉండాల్సినవారు పార్టీల కార్యకర్తలుగా మారి పరస్పరం కొట్టుకుంటున్నారు.
ఆనాటి ఉద్యమ స్పూర్తి, ఐక్యత ఏమయ్యాయి? దీని కోసమేనా ఆనాడు వేలాదిమంది అమరవీరులు తమ బలిదానాలు చేసుకున్నారు?
ఏ నాయకుడైనా ప్రజలను కలిపి ముందుకు తీసుకుపోవాలి తప్ప పార్టీలు, తమ రాజకీయ ప్రయోజనాల కోసం విడదీయరాదు.
నాడు ఆంధ్ర పాలకులు తెలంగాణను దోచుకున్నారని వారిని తరిమి కొడితే రాష్ట్రంలో ఇప్పుడేమి జరుగుతోంది? పదేళ్ళలో తెలంగాణ రాష్ట్రాన్ని తిరుగులేని విధంగా అభివృద్ధి చేశామని కేసీఆర్ చెప్పుకుంటారు.
అభివృధ్ది పేరుతో కేసీఆర్ కుటుంబం, బిఆర్ఎస్ నేతలు లక్షల కోట్లు దోచుకుని ఆస్తులు పోగేసుకున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సాక్ష్యాధారాలు కూడా చూపిస్తున్నారు. ఇవన్నీ చాలవన్నట్లు తమకు రాష్ట్రంలో ఎదురేలేకుండా చేసుకోవడానికి ఫోన్ ట్యాపింగ్‌లు చేయించడం ఇంకా దారుణం కాదా?
ఆంధ్రా పాలకులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని తరిమికొట్టిన కేసీఆర్, బిఆర్ఎస్ చేసిన ఘనకార్యాలు ఇవేనా? నాడు ఆంధ్రా పాలకులను తిట్టిపోసారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారు!
ప్రజాస్వామ్యం అంటే ఏమాత్రం గౌరవం చూపకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బెదిరిస్తున్నారు? తెలంగాణ ఏర్పడింది ప్రజల కోసమా కేసీఆర్ ఆయన కుటుంబం, బిఆర్ఎస్ పార్టీ కోసమా?
ఈ రాజకీయాలను పక్కన పెడితే, పదేళ్ళ క్రితం తెలంగాణ ప్రజలందరూ కులమతాలు, పార్టీలు బేద భావాలు ఏమీ లేకుండా అందరం ఏవిదంగా కలిసి మెలిసి పోరాడాము? పదేళ్ళ తర్వాత ఇప్పుడు ఎందుకు ఇంతగా విడిపోయాము? పార్టీల కోసం ఒకరినొకరు ఎందుకు ఇంతగా ద్వేషించుకుంటున్నాము? అని ప్రతీ ఒక్కరూ నేడు తప్పక ఆలోచించాలి.