రాజముద్ర మార్పు: వెనక్కు తగ్గిన రేవంత్‌ ప్రభుత్వం

May 30, 2024


img

తెలంగాణ రాజముద్ర మార్పు విషయంలో తెలంగాణ ప్రభుత్వం వెనకడుగు వేసింది. దానిలో మార్పులు చేర్పులపై అనేక సూచనలు వచ్చినందున వాటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు మిత్రపక్షాలతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. కనుక ప్రస్తుతానికి రాజముద్రలో ఎటువంటి మార్పులు ఉండవు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న రాజముద్రే కొనసాగుతుంది. 

రాజముద్రలో ఛార్మినార్, కాకతీయ తోరణం తొలగించి వాటి స్థానంలో అమరవీరుల చిహ్నం, ప్రజాస్వామ్యాన్ని సూచించే గుర్తులతో కొత్తగా మరో రాజముద్రని ప్రముఖ చిత్రకారుడు రుద్ర రాజేశం సిద్దం చేసి ప్రభుత్వానికి అందించారు. దానిని జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున విడుదల చేయాలనుకున్నారు. 

కానీ రాజముద్రలో మార్పులను బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. అభివృద్ధి, ప్రజా సమస్యలు, హామీల అమలు గురించి ఆలోచించాల్సిన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్‌ మీద కక్షతో ఇటువంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు చేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేసింది. 

బహుశః ఈ ఒత్తిళ్ళ వలన కావచ్చు... లేదా రాజముద్రలో మార్పులు చేర్పులు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవలసి ఉంటుంది. దీనిపై అభ్యంతరం తెలుపుతున్న బిఆర్ఎస్ పార్టీ హైకోర్టులో పిటిషన్‌ వేసి తెలంగాణ ప్రభుత్వాన్ని కోర్టుకు ఈడుస్తామని హెచ్చరిస్తోంది కూడా. ఈ నిర్ణయంపై ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నట్లు తెలియడంతో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం వెనక్కు తగ్గిన్నట్లు భావించవచ్చు. పంతానికి పోయి సమస్యలు తెచ్చిపెట్టుకోకుండా వెనక్కు తగ్గడం మంచి నిర్ణయమే అని చెప్పవచ్చు. 


Related Post