కేసీఆర్‌ని ఓడగొట్టిన రేవంత్‌ ఆయనకే దొరికిపోతున్నారా?

May 30, 2024


img

తెలంగాణలో కేసీఆర్‌ కొట్టే మొగాడే పుట్ట లేదని బిఆర్ఎస్ నేతలు గర్వంగా చెప్పుకునేవారు. కానీ రేవంత్‌ రెడ్డి ఆయనను ఓడగొట్టి ఆ మొగాడిని నేనే అని నిరూపించుకున్నారు. 

అయితే ఇప్పుడు తాజా నిర్ణయాలతో అదే కేసీఆర్‌ చేతికి దొరికిపోవడమే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం కలుగజేసుకుంటున్నట్లున్నారు. 

తెలంగాణ ప్రభుత్వ చిహ్నంలో కాకతీయ తోరణం, ఛార్మినార్ బొమ్మలు తొలగించాలనే నిర్ణయం వలన కాంగ్రెస్‌ పార్టీకి ఒరిగిందేమీ లేదు కానీ దానితో మళ్ళీ ప్రజలలో తెలంగాణ సెంటిమెంట్ రగిలించి బిఆర్ఎస్ పార్టీ లాభపడేందుకు ప్రయత్నిస్తోంది. 

బిఆర్ఎస్ పార్టీ రాజకీయ ఎదుగుదలకు, రాజకీయంగా బలపడి అధికారంలో వచ్చేందుకు తెలంగాణ సెంటిమెంట్ ఎంతగా ఉపయోగపడిందో అందరికీ తెలుసు. 

రాష్ట్రంలో తొలిసారి కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, కేసీఆర్‌ హయాంలో చేసిన అప్పులు, అభివృద్ధి పేరుతో చేసిన అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంతో చేసిన అరాచకాలు ఒకటొకటిగా బయటపెడుతుండటంతో కేసీఆర్‌ పట్ల ప్రజలలో విముఖత పెరిగుతోంది. 

కానీ ఇప్పుడు ఈ నిర్ణయంతో రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌కు బాగా అచ్చొచ్చిన తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని అందించి బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ బలపడేందుకు తోడ్పడుతున్నట్లవుతోంది.     

‘జయ జయహే...’ తెలంగాణ గీతాన్ని సంగీత దర్శకుడు కీరవాణితో స్వరపరచాలనే నిర్ణయం పట్ల కూడా కొందరు తెలంగాణవాదులు లేదా వారి పేరుతో బిఆర్ఎస్ పార్టీయే వ్యతిరేకిస్తోంది. ఇది కూడా తెలంగాణ సెంటిమెంట్‌తో ముడిపడినదే కనుక సిఎం రేవంత్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్రంపై కేసీఆర్‌ ముద్రని తొలగించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.


Related Post