కేసీఆర్‌ని అరెస్ట్ చేయాలనా లేదా కట్టడి చేయాలనా?

May 28, 2024


img

తెలంగాణ టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్‌డీ రాధాకిషన్ రావు సిట్ బృందానికి ఇచ్చిన వాగ్మూలంలో కేసీఆర్‌ ఆదేశం మేరకే బిఆర్ఎస్ నేతలతో సహా పలువురు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్‌ చేసిన్నట్లు పేర్కొన్నారు. 

అదే కేసులో అరెస్ట్ అయిన ఎస్పీ భుజంగరావు ఇచ్చిన తాజా వాంగ్మూలంలో కూడా తాము కేసీఆర్‌, బిఆర్ఎస్ ప్రత్యర్ధులను, వారి సానుభూతిపరులను, ప్రత్యర్ధి పార్టీలకు ఆర్ధికసాయం అందించేవారి ఫోన్లను ట్యాపింగ్ చేసి, ఆ సమాచారంతో వారిని బెదిరించి, భయపెట్టేవారిమని పేర్కొన్నారు. టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో కేటీఆర్‌పై ఎక్కువగా విమర్శలు చేసిన వారి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసేవారిమని పేర్కొన్నారు. 

రియల్ ఎస్టేట్ తదితర వ్యాపారవేత్తల నుంచి భారీగా డబ్బు వసూలు చేసేవారిమని, బిఆర్ఎస్ పార్టీ కోసం ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేయాలని ఒత్తిడి చేసేవారిమని, లేకుంటే ఇబ్బందులు తప్పవని బెదిరించి మరీ వసూలు  పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ నేతలు ఇచ్చిన డబ్బుని పోలీసు వాహనాలలోనే తీసుకువెళ్లి ఆయా నియోజకవర్గాలలో బిఆర్ఎస్ పార్టీకి చేరవేసేవారిమని భుజంగరావు తాజా వాంగ్మూలంలో పేర్కొన్నారు.

వీరిరువురు ఇచ్చిన ఈ వాంగ్మూలాలను కేసీఆర్‌, బిఆర్ఎస్ నేతలు ‘కాంగ్రెస్‌ నేతల చిల్లర రాజకీయాలు’ అంటూ కొట్టి పడేయడం ఖాయమే. 

అయితే కల్వకుంట్ల కవిత కేసులో కూడా ఇలాగే కేసీఆర్‌ ప్రగల్భాలు పలికారు. కానీ చివరికి సీబీఐ ఆమెను ఆయన కళ్ళ ముందే అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకుపోతే ఏమీ చేయలేకపోయారు. రెండు నెలలుగా ఆమె ఢిల్లీ తిహార్ జైల్లో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉండిపోతే కూతురుని కేసీఆర్‌ విడిపించుకోలేకపోయారు. 

ఈ ఫోన్ ట్యాపింగ్‌ కేసు ఇంకా తీవ్రమైనది. కనుక వీటి నుంచి కేసీఆర్‌ తదితరులు తప్పించుకోగలరా? వీటితో వారిని కాంగ్రెస్‌ ప్రభుత్వం అరెస్ట్ చేయగలదా లేదా తమ జోలికి రాకుండా కట్టడి చేయడానికి మాత్రమే ఉపయోగించుకోవాలని అనుకుంటోందా? అనే ప్రశ్నలకు రాబోయే రోజుల్లో మూడు ప్రధాన పార్టీల మద్య జరిగే రాజకీయ ఆధిపత్య పోరుని బట్టి సమాధానాలు మారవచ్చు.


Related Post