బిఆర్ఎస్ నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేయించారట!

May 28, 2024


img

టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఆఫీసరు (ఓఎస్‌డీ)గా పనిచేసిన రాధాకిషన్ రావు ఫోన్ ట్యాపింగ్‌ కేసులో అనేక సంచలన విషయాలు బయటపెట్టారు. ఈ కేసుపై విచారణ జరుపుతున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ (సిట్)కు ఇచ్చిన వాంగ్మూలంలో ఎవరూ ఊహించలేని కొత్త విషయాలు బయటపెట్టారు. 

1. బిఆర్ఎస్ పార్టీలోని కడియం శ్రీహరి, టి.రాజయ్య, శంభీపూర్ రాజా, పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, ఈటల రాజేందర్‌ తదితరుల ఫోన్లు ట్యాపింగ్ చేశామని వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.  

2. ప్రతిపక్ష నేతలలో రేవంత్‌ రెడ్డి, బండి సంజయ్‌, ధర్మపురి అర్వింద్, జానారెడ్డి కుమారుడు రఘువీర్, జువ్వాది నర్సింగరావు, వంశీకృష్ణ, కవ్వంపల్లి సత్యనారాయణ, ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్‌ (ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు), ఇంకా పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, నిర్మాణ సంస్థల యాజమానులు, రెండు ప్రముఖ తెలుగు మీడియా సంస్థల అధిపతుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసిన్నట్లు పేర్కొన్నట్లు  తెలుస్తోంది. 

3. తెలంగాణ స్పెషల్ ఇంటలిజన్స్ బ్యూరో (ఎస్‌ఐబి) ప్రభాకర్ రావు, డీఎస్పీ ప్రణీత్ రావులతో సంప్రదింపులు జరుపుతూ ఈ ఫోన్ ట్యాపింగ్‌ ద్వారా సేకరించిన సమాచారాన్ని పెద్దాయనకు చేరవేస్తుండేవారిమని రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

4. నలుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసిన వ్యవహారంలో ఎవరూ ఊహించని కొత్త విషయాలు రాధాకిషన్ రావు బయటపెట్టిన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఒక్కరినే బీజేపీలోకి ఆకర్షించాలని ప్రయత్నించిందని, ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్‌, మునుగోడు ఉప ఎన్నికల కొరకు, లిక్కర్ స్కామ్‌ నుంచి కల్వకుంట్ల కవితకి విముక్తి కల్పించేందుకు          పెద్ద ప్లాన్ వేశారని పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

5. ఈ వ్యవహారంలో మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని రోహిత్ రెడ్డి ద్వారా బీజేపీని నమ్మించి, బీజేపీ సీనియర్ నేతలైన సంతోష్ కుమార్‌, కేరళలో మరో బీజేపీ ప్రముఖుడిని అరెస్ట్ చేయించాలని కేసీఆర్‌ ప్లాన్ చేశారని రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

6. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో బీజేపీ ప్రతినిధులను రెడ్ హ్యాండ్‌గా పట్టుకొని అరెస్ట్ చేసేందుకు అప్పట్లో టాస్క్ ఫో ర్స్‌లో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్ శ్రీనాధ్ రెడ్డి, సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్‌లను ఢిల్లీకి పంపించి స్పై కెమెరాలు కొనిపించారని పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

7. వాటిని అశోక్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో బిగింపజేసి ముగ్గురు బీజేపీ ప్రతినిధులను ట్రాప్ చేసి పట్టుకుని ఆ ఆడియో, వీడియో క్లిప్స్ కేసీఆర్‌కు అందజేశామని, కానీ ఈ కేసు సీబీఐకి బదిలీ అవడంతో కేసీఆర్‌ ప్లాన్ బెడిసికొట్టిందని రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.


Related Post