బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం నర్సంపేటలో పట్టభద్ర ఓటర్లను ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, “మేము యువతకు 2 లక్షల ప్రభుత్వోద్యోగాలు ఇచ్చాము. ప్రభుత్వోద్యోగులకు భారీగా జీతాలు పెంచాము. కానీ అందరికీ దూరమయ్యాము. మా ప్రభుత్వం చేసిన మంచి పనులు చెప్పుకోకపోవడం వలననే స్వల్ప తేడాతో ఓడిపోయాము.
ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలతో రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోదు. మారిపోదు. కానీ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ నేతలు ఏమేమి హామీలు ఇచ్చారు? వాటిలో ఎన్నిటిని అమలుచేశారు?నాడు మీతో ఏం చెప్పారు. ఇప్పుడు ఏం చెపుతున్నారు? అని బేరీజు వేసుకొని ఓట్లు వేయమని కోరుతున్నాను.
కాంగ్రెస్ చేతిలో ఒకసారి మోసపోతే అది ప్రజల తప్పు కాదు. కానీ మళ్ళీ మళ్ళీ మోసపోతే అది తప్పే అవుతుంది. శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ మాయమాటలు నమ్మి ఓట్లు వేసి గెలిపించారు కానీ ఈ ఆరు నెలల్లో కాంగ్రెస్ పాలన ఏవిదంగా ఉందో అందరూ చూశారు కనుక అందరూ విజ్ఞతతో ఓట్లు వేయాలని కోరుతున్నాను,” అని కేటీఆర్ అన్నారు.
యువతకు ప్రభుత్వోద్యోగాలు ఇచ్చినా, ప్రభుత్వోద్యోగులకు జీతాలు పెంచినా అందరూ బిఆర్ఎస్ పార్టీకి ఎందుకు దూరం అయ్యారు? అని ప్రశ్నించుకోవలసిన కేటీఆర్, చేసిన మంచిపనులు చెప్పుకోకపోవడం వలననే దూరమయ్యామని ఇంకా ఆత్మవంచన చేసుకుంటున్నారు.
ప్రభుత్వోద్యోగాల భర్తీ ప్రక్రియని దానికే పరిమితం చేయకుండా దాంతో 2023 శాసనసభ ఎన్నికలలో ఓట్లు రాల్చుకోవాలనే దురాలోచన చేసింది. ఆ క్రమంలో భర్తీ ప్రక్రియని సాగదీసుకుంటూ పోయింది. ఈ కారణంగా మద్యలో టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ కుంభకోణం బయటపడింది. దాని కారణంగా లక్షల మంది అభ్యర్ధులు నష్టపోయారు. అయినా దిద్దుబాటు చర్యలు చేపట్టకుండా, పరీక్షలు రద్దు, వాయిదా వేసుకుంటూ పోవడంతో మరోసారి లక్షల మంది అభ్యర్ధులు నష్టపోయారు.
ప్రభుత్వోద్యోగులకు జీతాలు పెంచిన మాట వాస్తవమే కానీ కేసీఆర్ వారి సమస్యలను అర్దం చేసుకునే ప్రయత్నం చేయకుండా వారితో చాలా అహంభావంతో వ్యవహరించారు. ముఖ్యంగా టిఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు 55 రోజులు సమ్మె చేసినప్పుడు వారితో కేసీఆర్ వ్యవహరించిన తీరుని అందరూ తప్పు పట్టారు.
కేసీఆర్ మొండి పట్టుదల కారణంగా 40-50 మంది టిఎస్‌ఆర్టీసీ కార్మికులు చనిపోయారు. కానీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవరూ కనీసం స్పందించలేదు.
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల విషయంలో జరిగిన జాప్యం కూడా వారి ఆగ్రహానికి కారణం అయ్యింది. కనుక ఉద్యోగాల భర్తీలో నిబద్దత, పారదర్శకత కొరవడినందున యువత, ప్రభుత్వోద్యోగులతో కేసీఆర్ వ్యవహరించిన తీరు వలన వారు బిఆర్ఎస్‌కు దూరమయ్యారు తప్ప చేసిన మంచి పనులు చెప్పుకోకపోవడం వలన కానే కాదు. కానీ ఈవిదంగా చెప్పుకోవడం తమ తప్పులను, వైఫల్యాలను కప్పిపుచ్చుకొని సమర్ధించుకోవడానికి మాత్రమే అని భావించవచ్చు.