కేసీఆర్‌ని తుడిచేయాలంటే తెలంగాణనే తుడిచేయాలి: కేసీఆర్‌

April 24, 2024


img



తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ చాలా కాలం తర్వాత తొలిసారిగా మంగళవారం ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్‌ టీవీ9 స్టూడియోకి వచ్చి ముఖాముఖి చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు సమాధానం చెపుతూ, “తెలంగాణలో కేసీఆర్‌ ఆనవాళ్ళు లేకుండా చేస్తానని కొందరు (రేవంత్‌ రెడ్డి) చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. కేసీఆర్‌ ఆనవాళ్ళు తొలగించాలంటే ముందు మీరు (సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు) కూర్చోన్న సచివాలయాన్ని కూల్చేయాలి. హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో మేము నిర్మించిన ప్రతీ కట్టడాన్ని కూల్చేయాలి. తెలంగాణ రాష్ట్రం లేకుండా చేస్తే తప్ప కేసీఆర్‌ ఆనవాళ్ళని ఎవరూ తుడిచేయలేరు. తెలంగాణ ఉన్నంతకాలం కేసీఆర్‌ పేరు చిరస్థాయిగా ఉంటుందని నేను గర్వంగా చెప్పుకోగలను. కేసీఆర్‌ అంటే హిస్టరీ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ చరిత్రలో నేను ఒక భాగమే. దీనిని మార్చడం ఎవరి తరమూ కాదు. నేను ఎదగాలసిన ఎత్తు ఎదిగాను. నన్ను తగ్గించాలని చాలా మంది ప్రయత్నాలు చేసి భంగపడ్డారు. నన్ను తగ్గించడం ఎవరి తరమూ కాదు,” అని కేసీఆర్‌ అన్నారు.  

సిఎం రేవంత్‌ రెడ్డి గురించి అడిగిన మరో ప్రశ్నకు సమాధానం చెపుతూ “ఆయనకి నాపై కోపం ఉందని అనుకోవడం లేదు. అదొక రకం అజ్ఞానం, అహంకారం అంతే. అందుకే నా గురించి అలా చులకనగా మాట్లాడుతున్నాడు. రోజుకో దేవుడిపై ఓట్లు వేస్తూ నన్ను తిడుతూ కాలక్షేపం చేస్తున్నాడు. కానీ ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుచేయడం లేదు,” అని అన్నారు. 

బిఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తామని రేవంత్‌ రెడ్డి చేస్తున్న శపధాలపై స్పందిస్తూ, “రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నా కనుమరుగు కావు. ఇందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీయే ఉదాహరణ. అది పదేళ్ళు ప్రతిపక్షంలో ఉంది కానీ నేడు అధికారంలోకి వచ్చింది. ప్రతీ పార్టీ తమ వంతు, అవకాశం కోసం ఎదురుచూస్తూ పోరాడుతూనే ఉంటాయి. కాంగ్రెస్‌ అబద్దాలు నమ్మి గెలిపించామని ఇప్పటికే ప్రజలు బాధ పడుతున్నారు. ప్రజల ఆలోచనలో మార్పు వస్తే మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ తప్పకుండా రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం,” అని కేసీఆర్‌ అన్నారు.



Related Post