దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 102 ఎంపీ సీట్లకు, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం శాసనసభ ఎన్నికలకు శుక్రవారం మొదటి విడత పోలింగ్ దాదాపు ప్రశాంతంగా ముగిసింది. మొదటి విడతలో 63.5 శాతం పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికలలో 69.43 శాతం నమోదు కాగా ఈసారి 5.93 శాతం తగ్గింది.
పోలింగ్ సమయం ముగిసే సరికి క్యూలైన్లో ఉన్నవారందరినీ అనుమతించాల్సి ఉంటుంది కనుక అనేక ప్రాంతాలలో రాత్రి 7-8 గంటల వరకు పోలింగ్ జరిగింది.
శుక్రవారం జరిగిన మొదటి విడత ఎన్నికలలో 102 ఎంపీ స్థానాలకు 1600 మంది అభ్యర్ధులు పోటీ పడ్డారు. వారిలో తెలంగాణ, పుదుచ్చేరి మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కూడా ఒకరు.
అరుణాచల్ ప్రదేశ్ శాసనసభలో 60 స్థానాలకు, సిక్కిం శాసనసభలో 32 స్థానాలకు కూడా శుక్రవారమే పోలింగ్ జరిగింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో లోక్‌సభ ఎన్నికలు మే 13న ఒకేసారి జరుగబోతున్నాయి. అదే రోజున ఏపీ శాసనసభ ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా జరుగబోతోంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.