లోక్‌సభ ఎన్నికలు: మూడు పార్టీలకు కీలకమే

April 18, 2024


img

తెలంగాణలో 17 లోక్‌సభ 17 ఎంపీ, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ శాసనసభ ఉప ఎన్నికకు నేడు నోటిఫికేషన్‌ వెలువడనుంది. నేటి నుంచే నామినేషన్స్‌ ప్రక్రియ మొదలవుతుంది. ఈ నెల 25వరకు గడువు ఉంది. మే 13న పోలింగ్‌ జరిపి, జూన్ 4న ఓట్లు లెక్కిస్తారు. అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ, బిఆర్ఎస్ మూడు ప్రధాన పార్టీలకు ఈ ఎన్నికలు చాలా కీలకమే. కాంగ్రెస్‌ ప్రభుత్వం నాలుగు నెలల పరిపాలనకు ఈ ఎన్నికలు రిఫరెండం అని సిఎం రేవంత్‌ రెడ్డి స్వయంగా ప్రకటించారు.

కనుక తమ ప్రభుత్వానికి, పాలనకు ప్రజామోదం లభించిందని నిరూపించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవలసి ఉంటుంది. లేకుంటే బిఆర్ఎస్ నేతలు వాదిస్తున్నట్లు అప్పుడే ప్రజలలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత మొదలైన్నట్లు తప్పుడు సంకేతాలు వెళతాయి. కనుక ఈ ఎన్నికలలో కనీసం 10-12 సీట్లు గెలుచుకునేందుకు రేవంత్‌ రెడ్డి టీం శాయశక్తుల కృషి చేస్తోంది.   

బిఆర్ఎస్ పార్టీ శాసనసభ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలు పార్టీని వీడి వెళ్ళిపోయారు. దీంతో బిఆర్ఎస్‌, కేసీఆర్‌ పని అయిపోయిందని కాంగ్రెస్‌, బీజేపీలు వాదిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్‌ పూర్తిగా ఖాళీ అయిపోతుందని వాదిస్తున్నారు.

కానీ ప్రజలు బిఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని, రాష్ట్ర రాజకీయాలపై బిఆర్ఎస్‌ పట్టు కోల్పోలేదని నిరూపించుకోవడానికి ఈ ఎన్నికలలో అత్యధిక సీట్లు గెలుచుకోవడం చాలా ముఖ్యం. లేకుంటే బిఆర్ఎస్ పతనాన్ని ఎవరూ ఆపలేరు.    

శాసనసభ ఎన్నికలలో 8 సీట్లు గెలుచుకొని, రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెంచుకున్న బీజేపీ లోక్‌సభ ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలుచుకొని తెలంగాణలో తమ బలం మరింత పెంచుకోవాలని చాలా పట్టుదలగా ఉంది. ముఖ్యంగా ఈసారి జాతీయ స్థాయిలో బీజేపీ 370-400 ఎంపీ సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకొంది కనుక తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలుచుకోవడం చాలా అవసరమే. 

ఈవిదంగా మూడు పార్టీలకు ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. కానీ ఈసారి ఎన్నికలలో ప్రధానంగా కాంగ్రెస్‌, బీజేపీల మద్యనే పోటీ జరిగే అవకాశం కనిపిస్తోంది.


Related Post