ఫిరాయింపుల కేసు సుప్రీం ధర్మాసనానికి!

November 08, 2016


img

తెలంగాణాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుపై ఆ పార్టీ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఆ కేసుని మంగళవారం విచారించిన సుప్రీంకోర్టు, ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత దానిని మరింత లోతుగా విచారించవలసిన అవసరం ఉందని భావిస్తూ ఆ కేసుని సుప్రీం ధర్మాసనానికి బదిలీ చేసింది. స్పీకర్ పరిధిలో ఉన్న వ్యవహారాలలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి చట్టప్రకారం వీలులేదు. అందుకే అటువంటి వ్యవహారాలలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి ఇష్టపడవు. ఈ కేసుని మొదట విచారించిన హైకోర్టు, దీనిపై తగిన నిర్ణయం తీసుకోవలసిందిగా తెలంగాణా శాసనసభ స్పీకర్ మధుసూదనాచారికి సూచించింది. కానీ ఆయన స్పందించకపోవడంతో హైకోర్టు నిస్సహాయత వ్యక్తం చేసింది. తరువాత దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కూడా ఆయనకీ నోటీసు జారీ చేసింది. ఈ వ్యవహారంలో నిర్ణయం ఎప్పటిలోగా తీసుకొంటారో తెలియజేయవలసిందిగా కోరింది. 

దానిపై తెరాస సర్కార్ ప్రభుత్వం తరపున వాదించిన అడ్వకేట్ జనరల్ రామకృష్ణా రెడ్డి యధాప్రకారం ఈ వ్యవహారం స్పీకర్ పరిధిలో ఉన్న అంశమని దానిలో న్యాయస్థానాలకి జోక్యం చేసుకొనే హక్కు లేదని వాదించారు. కానీ దీనిలో రాజకీయ నైతిక విలువల గురించి సుప్రీంకోర్టు కొన్ని ప్రశ్నలు వేసింది. ఈ కేసుని చట్టం కోణంలో నుంచే కాకుండా వేరేవిధంగా కూడా చూడవలసి ఉందని, కనుక ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ జరుపవలసిన అవసరం ఉందని భావిస్తూ సుప్రీం ధర్మాసనానికి ఈ కేసుని బదిలీ చేసింది. సుప్రీంకోర్టు నిర్ణయం వలన తెరాస సర్కార్ కొత్తగా వచ్చే కష్టం, నష్టం ఏమీ ఉండకపోయినప్పటికీ, ఆ కేసుని పక్కనపెట్టకుండా సుప్రీం ధర్మాసనానికి పంపించడం కొంచెం ఇబ్బందికరమైన విషయమే.



Related Post