తెలుగు బాషా వికాసానికి అమెరికన్ కృషి!

November 08, 2016


img

గత మూడు-నాలుగు దశాబ్దాలుగా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు తమ పిల్లలని ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళకే పంపిస్తుండటం వలన ఇప్పుడు చాలా మందికి తెలుగు చదవడం, వ్రాయడం రాదు. కొంతమందికి మాట్లాడటం కూడా రాదు. అందుకు అందరూ సిగ్గు పడాలి కానీ ఎవరూ బాధపడటం లేదు కూడా! పైగా మాకు తెలుగురాదని గర్వంగా చెప్పుకొనే పరిస్థితులు రెండు తెలుగు రాష్ట్రాలలో కనిపిస్తోంది. ఈ జబ్బు మన తెలుగు రాష్ట్రాలలోనే కాదు యావత్ దేశానికి విస్తరించింది. అన్ని రాష్ట్రాలలో ప్రజలకి, పిల్లలకి వారివారి మాతృబాషలలో వ్రాయడం, చదవడం చేతకాని పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వాలు కూడా మాతృబాషలని చులకనగా చూస్తూ, ఇంగ్లీషునే ప్రోత్సహిస్తుండటంతో భారతీయ బాషలు తమ ఉనికిని కోల్పోయే ప్రమాదం కనబడుతోంది.  

భారత్ లో ప్రజలు తమ మాతృబాషలని చులకనగా చూస్తుంటే, విదేశీయులు మన దేశానికి వచ్చి మన బాషలు, సంస్కృతి సంప్రదాయాల గురించి లోతుగా అద్యయనం చేసి వాటి గొప్పదనం ఏమిటో గుర్తిస్తున్నారు. కేరళలో అనంతపద్మనాభ స్వామి ఆలయంలో బయటపడిన లక్షలకోట్ల విలువగల బంగారు నగలు మెల్లమెల్లగా మాయం అవుతుంటే లండన్ లో ఉన్న మన కోహినూర్ వజ్రం భద్రంగా ఉన్నట్లుగానే, దేశంలో మన బాషలు, సంస్కృతి సంప్రదాయాలు మెల్లమెల్లగా కనుమరుగవుతుంటే, వాటిని విదేశాలలో ప్రవాసభారతీయులు భద్రంగా కాపాడుకొస్తున్నారు. మన బాష, సంస్కృతి సంప్రదాయాల గొప్పదనం గురించి తెలుసుకోవాలంటే విదేశాలకి వెళ్ళి వారిని చూసి నేర్చుకోవలసిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు. 

ఇక విషయంలోకి వస్తే, అమెరికాలోని సౌత్ ఏషియన్ స్టడీస్ డిపార్టమెంట్ కి డైరెక్టర్ గా ఉన్న లీస మిషైల్ తెలుగు బాష వికాసానికి కృషి చేస్తుండటం చాలా గొప్ప విషయం. ఆమె తెలుగులో అనర్గళంగా మాట్లాడగలరు. పుస్తకాలు కూడా వ్రాయగలిగేంత బాషాపై పట్టు, జ్ఞానం సంపాదించుకొన్నారు. ఆమె కొల్లాపూర్ విమల గారి దగ్గర తెలుగు నేర్చుకోవడమే కాకుండా తెలుగు బాష గురించి, తెలుగు రాష్ట్రాల ప్రజల సంస్కృతి సంప్రదాయాల గురించి పుస్తకాలు కూడా వ్రాశారు. దాని కోసం ఆమె స్వయంగా ఆంద్రా, తెలంగాణా రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో సుమారు 3-4 ఏళ్ళ పాటు తిరిగి రెండు తెలుగు రాష్ట్రాలలో బాష, యాస, సంస్కృతి సంప్రదాయాలు, ఉద్యమాల గురించి చాల లోతుగా అధ్యయనం చేశారు. తెలంగాణా ఉద్యమం గురించి కూడా ఆమె ఒక పుస్తకం వ్రాస్తున్నారు. 

ఆమె తెలుగు బాషని నేర్చుకోవడమే కాకుండా, తెలుగు బాషా వికాసానికి కృషి చేస్తుండటం చాల గొప్ప విషయం. కొన్ని రోజుల క్రితం, యూనివర్సిటీ అఫ్ పెన్సిల్వేనియాలో విద్యార్ధులకి తెలుగు బాష ఔనత్యం గురించి తెలియజేసేందుకు ప్రొఫెసర్ అఫ్సర్ చేత ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. అది చాలా అద్భుతంగా సాగింది. లీస మిషైల్ చేస్తున్న ఈ కృషిని గుర్తించిన ఫిలడెల్ఫియా తెలంగాణా అసోసియేషన్ (PTA) ఆమెని సన్మానించి, ఆమె చేస్తున్న కృషి, తెలుగు బాష, తెలంగాణా ఉద్యమాలు, సంస్కృతి సంప్రదాయాల గురించి ఆమె నోటనే వినేందుకు ఆహ్వానించింది. 


Related Post