బీజేపీ, బిఆర్ఎస్ మద్య సంధి కుదురుతోందా?

March 19, 2024


img

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఈడీ తనను ఒంటరిగా విచారించడాన్ని సవాలు చేస్తూ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గత ఏడాది మార్చి14న సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్‌ వేశారు. కానీ సరిగ్గా ఏడాది తర్వాత అంటే మొన్న మార్చి 15న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.

కోర్టు అనుమతితో ఆమెను వారం రోజులపాటు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈడీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఆమె వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకొన్నారు. సుప్రీంకోర్టు ఇందుకు అనుమతించింది.

ఆమె తరపు న్యాయవాది విక్రమ్ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ, “కల్వకుంట్ల కవితని ఇప్పటికే అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నందున, ఈ పిటిషన్‌ అర్దరహితంగా మారింది. కనుక దీనిని సుప్రీంకోర్టు అనుమతితో ఉపసంహరించుకున్నాము. కానీ కల్వకుంట్ల కవితకు ఉపశమనం కలిగించేందుకు వీలుగా మరో పిటిషన్‌తో సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తాము,” అని చెప్పారు. 

బహుశః కల్వకుంట్ల కవితకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్‌ వేయవచ్చు. కానీ ఈ కేసు కేవలం న్యాయస్థానాల పరిధికి మించి బీజేపీ- బిఆర్ఎస్-ఆమాద్మీ పార్టీల  రాజకీయాలతో ముడిపడి ఉందనే విషయం అందరికీ తెలిసిందే. కనుక కోర్టు బయట వాటి మద్య అవగాహన కుదిరితే తప్ప బహుశః కల్వకుంట్ల కవితకు బెయిల్‌ లభించకపోవచ్చు. 

ఉదాహరణకు ఏపీలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో జగన్‌ ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు, ఆయనను విడిపించేందుకు ఆయన కుమారుడు నారా లోకేష్‌ సుప్రీంకోర్టులో ఎంత న్యాయపోరాటం చేసినా బెయిల్‌ లభించలేదు.

కానీ జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ కేంద్రంతో రాయబారం చేయగానే బెయిల్‌ లభించడమే కాకుండా, అప్పటి నుంచి జగన్‌ ప్రభుత్వం ఆయనపై ఎన్ని కొత్త కేసులు పెడుతున్నా కోర్టులు పెద్దగా స్పందించడం లేదు. 

బహుశః లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ- బిఆర్ఎస్ పార్టీల మద్య ఓ రహస్య అవగాహన కుదిరితే ఈ కేసులో కల్వకుంట్ల కవితకు బెయిల్‌ లభించవచ్చు. ఈ కేసు మళ్ళీ అటకెక్కిపోవచ్చు. బహుశః సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్‌ ఉపసంహరణ దానిలో భాగమే అని అనుకోవాలేమో? 


Related Post