సమయం లేదు మిత్రమా... కాంగ్రెస్‌, బీజేపీలో చేరిపోదాము!

March 17, 2024


img

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడటంతో బిఆర్ఎస్ పార్టీలో నేతలందరూ ‘సమయం లేదు మిత్రమా... కాంగ్రెస్‌ లేదా బీజేపీలో చేరిపోదాము...’ అంటూ రాజీనామాలు చేస్తున్నారు. 

ఆదివారం చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామాలు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. 

వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు ఆరూరి రమేష్‌ కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఆయన బీజేపీలో చేరబోతున్నారు. ఇంకా పలువురు బిఆర్ఎస్ నేతలు పార్టీని వీడేందుకు సిద్దంగా ఉన్నారు. 

లోక్‌సభ ఎన్నికలకు ముందే బిఆర్ఎస్ పార్టీ ఇంత వేగంగా ఖాళీ అయిపోతుండటం కేసీఆర్‌కు తీవ్ర ఆందోళన కలిగించే విషయమే. సరిగ్గా ఇదే సమయంలో అధికారంలో ఉన్నంతకాలం బిఆర్ఎస్ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న మజ్లిస్ పార్టీ కూడా కాంగ్రెస్‌ పంచన చేరింది. ఇది లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. 

ఇదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కుమార్తె కల్వకుంట్ల కవితని ఈడీ అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించడం, అక్కడ న్యాయస్థానం ఈడీ ఆమెను ప్రశ్నించేందుకు వారం రోజుల కస్టడీ ఇవ్వడం కేసీఆర్‌ కుటుంబానికి, బిఆర్ఎస్ పార్టీకి చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. 

శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోగానే ఒక్కసారిగా ఇంత వ్యతిరేక పరిస్థితులు ఏర్పడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంతకంటే చాలా క్లిష్ట పరిస్థితులను చాలా నిబ్బరంగా ఎదుర్కొన్న కేసీఆర్‌, ఇప్పుడు తెర వెనకే ఉండిపోతుండటం చూసి ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు. అన్ని సమస్యలు ఒకేసారి చుట్టుముట్టినందున వీటన్నిటి నుంచి కేసీఆర్‌ తన పార్టీని ఎలా బయటపడేస్తారో? ఎలా కాపాడుకుంటారో?


Related Post