నేడు అమిత్ షా హైదరాబాద్‌ పర్యటన... ఇటీజ్ డిఫరెంట్!

March 12, 2024


img

నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఈరోజు మధ్యాహ్నం 1.20 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. మధ్యాహ్నం 1.45 నుంచి 2.45 గంటల వరకు నగరంలోని ఇంపీరియల్ గార్డెన్‌లో బీజేపీ సోషల్ మీడియా వారియర్స్‌తో సమావేశమై, లోక్‌సభ ఎన్నికలకు పార్టీ తరపున ఏవిదంగా ప్రచారం చేయాలో, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాల గురించి ప్రచారం చేస్తూనే, కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీల విమర్శలను సోషల్ మీడియాలో ఏవిదంగా తిప్పికొట్టాలో అమిత్ షా వారికి వివరిస్తారు. 

ఆ తర్వాత అక్కడి నుంచి ఎల్బీ స్టేడియం చేరుకొని బీజేపీ అధ్వర్యంలో నిర్వహించే విజయ సంకల్ప సమ్మేళనంలో పాల్గొంటారు. ఈ సమ్మేళనంలో రాష్ట్రంలోని బీజేపీ పోలింగ్‌ బూత్‌ కమిటీల అధ్యక్షులు, జిల్లా, మండల కమిటీల అధ్యక్షులు, కార్యకర్తలు కలిపి సుమారు 50 వేల మంది పాల్గొనే అవకాశం ఉంది. 

ఈ సమ్మేళనం తర్వాత ఐటీసీ కాకతీయ హోటల్‌లో సాయంత్రం 5.45 గంటల వరకు పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై ఎన్నికల అభ్యర్ధులు, పార్టీ వ్యూహాల గురించి చర్చించి వారికి దిశానిర్దేశం చేస్తారు. 

అనంతరం సాయంత్రం 6.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.            

ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆయనతో కలిసి అధికారిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. మోడీని ‘పెద్దన్న’ అంటూ తెలంగాణ అభివృద్ధికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. 

కానీ నేడు అమిత్ షా బీజేపీ కార్యక్రమాలలో పాల్గొనేందుకు వస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎల్బీ నగర్‌ సభలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు కూడా చేయనున్నారు. కనుక ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం, వీడ్కోలు ఏర్పాట్లు మాత్రమే చేసి అందరూ దూరంగా ఉండబోతున్నారు.


Related Post