ఒక్క వార్నింగ్‌తో మల్లారెడ్డి మల్కాజ్‌గిరి నుంచి తప్పుకున్నారా?

March 08, 2024


img

లోక్‌సభ ఎన్నికలలో మల్కాజ్‌గిరి నుంచి తన కొడుకు భద్రారెడ్డి పోటీ చేస్తారని, కేసీఆర్‌ ఆ సీటుని తమ కుటుంబం కోసమే రిజర్వే చేసి ఉంచారని మాజీ మంత్రి, మేడ్చల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రెస్‌మీట్‌ మరీ గొప్పగా చెప్పుకున్నారు. అక్కడి నుంచి తన కుమారుడు పోటీ చేయడానికి మల్లారెడ్డి అన్ని ఏర్పాట్లు చేసుకుని సిద్దంగా ఉన్నారు కూడా. 

కానీ ఇప్పుడు మల్కాజ్‌గిరి నుంచి తన కుమారుడు పోటీ చేయదలచుకోలేదని కేసీఆర్‌కు చెప్పేసిన్నట్లు తెలుస్తోంది. దిండిగల్ చిన్నదామెర చెరువులో మల్లారెడ్డి అల్లుడు, బిఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీ భవనం కూల్చివేసిన వెంటనే మల్లారెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 

అక్కడ పురపాలక, రెవెన్యూ సిబ్బంది వారి కాలేజీ భవనాలు కూల్చుతున్న సమయంలో మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి ఇద్దరూ సిఎం రేవంత్‌ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసి మాట్లాడారు. ఆ తర్వాతే అక్కడ కూల్చివేతలు నిలిపివేశారు. 

బహుశః అందుకు ప్రతిగా మల్కాజ్‌గిరి పోటీ నుంచి విరమించుకొని ఉండవచ్చు. మల్లారెడ్డికి, ఆయన బంధువులకు చుట్టుపక్కల జిల్లాలో అనేక కాలేజీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి. మల్లారెడ్డి, బంధువులపై ఇటువంటి భూకబ్జా ఆరోపణలు కూడా చాలానే ఉన్నాయి. 

కనుక తమ వ్యాపారాలను కాపాడుకొంటూ, ఈ సమస్యలలో చిక్కుకోకుండా ఉండేందుకు హటాత్తుగా కాంగ్రెస్ పార్టీలో చేరితే విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది కనుక లోక్‌సభ ఎన్నికలలో పోటీ నుంచి తప్పుకొని కొంత ఉపశమనం పొందవచ్చని మల్లారెడ్డి భావించి ఉండవచ్చు. కేసీఆర్‌ కూడా ఈ సమస్య తీవ్రతని అర్దం చేసుకోగలరు కనుక మల్కాజ్‌గిరి కోసం మరో అభ్యర్ధిని సిద్దం చేయక తప్పదు.


Related Post