ప్రభుత్వం మారాక తెలంగాణలో అమిత్ షా తొలి పర్యటన

February 24, 2024


img

త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరుగబోతున్నందున తెలంగాణ బీజేపీ అధ్వర్యంలో విజయ సంకల్ప యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. దాని మొదటి విడత ముగింపు సభలో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్చి 2న రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్‌లో భారీ రోడ్ షో నిర్వహించబోతున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పర్యటనలో అమిత్ షా రాష్ట్ర బీజేపీ నేతలకు లోక్‌సభ ఎన్నికలకు సంబందించి దిశా నిర్దేశం చేయనున్నారు. 

తెలంగాణలో బిఆర్ఎస్‌ ప్రభుత్వం స్థానంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా అమిత్ షా నగరానికి వస్తున్నారు. కనుక ఆయన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం గురించి ఏవిదంగా మాట్లాడబోతున్నారు?

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా రాష్ట్ర పర్యటనకు వస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఏవిదంగా వ్యవహరిస్తుందనేది చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. 

గతంలో కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాతో సహా కేంద్ర మంత్రులు ఎవరు రాష్ట్రానికి వచ్చినా, ముఖ్యమంత్రి విమానాశ్రయానికి వెళ్ళి ఆహ్వానించేవారు కారు. మొక్కుబడిగా ఏవరో ఒకరిని పంపించి ప్రోటోకాల్ 'మమ' అనిపించేసేవారు. 

కానీ రేవంత్‌ రెడ్డి అందరినీ కలుపుకు పోయేందుకు ప్రయత్నిస్తున్నందున, విమానాశ్రయానికి వెళ్ళి స్వయంగా అమిత్ షాని ఆహ్వానిస్తారో లేదో చూడాలి. 


Related Post