సానుభూతి కోసమే నల్గొండ సభకు కేసీఆర్‌: రేవంత్‌

February 14, 2024


img

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఇంకా మూడు నెలలు కాలేదు. కానీ బిఆర్ఎస్ పార్టీ అప్పుడే కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోవడం, కేసీఆర్‌ మళ్ళీ ముఖ్యమంత్రి కావడం గురించి మాట్లాడుతుండటంతో రెండు పార్టీల మద్య రాజకీయ ఆధిపత్యపోరు మొదలైంది. 

బిఆర్ఎస్ పార్టీ కృష్ణా జలాలు, ప్రాజెక్టుల అంశంతో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్‌ ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజిలో క్రుంగిన పిల్లర్లు, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి గురించి మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తోంది.    

నిన్న నల్గొండ సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ ఇంత పెద్ద ప్రాజెక్టులో రెండు మూడు పిల్లర్లు క్రుంగడం సహజమని అన్నారు. అదే సమయంలో మంత్రులతో కలిసి మేడిగడ్డ బ్యారేజి పరిశీలనకు వెళ్ళిన సిఎం రేవంత్‌ రెడ్డి, ఘాటుగా స్పందించారు. 

“కాలు విరిగింది నడవలేనంటూ శాసనసభ సమావేశాలకు డుమ్మా కొట్టిన కేసీఆర్‌, కృష్ణా జలాలు, ప్రాజెక్టులపై శాసనసభలో జరిగిన చర్చలలో పాల్గొనేందుకు రాకుండా మొహం చాటేశారు. మేడిగడ్డ బ్యారేజి చూసి వద్దాము రమ్మనమని పిలిస్తే మళ్ళీ మొహం చాటేసి, నల్గొండ సభకు వెళ్ళి అక్కడ నోటికి వచ్చిన్నట్లు మాట్లాడారు. 

కృష్ణా జలాలు, ప్రాజెక్టులపై నీచ రాజకీయాలు చేయడానికి, లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రజల సానుభూతి సంపాదించుకోవడం కోసమే నల్గొండ సభకు వెళ్ళారు తప్ప వాటిపై ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. 

ఆయన ఆస్పత్రిలో ఉన్నప్పుడు మేము, రాష్ట్ర ప్రజలు అందరూ ఆయనకు సానుభూతి చూపాము. ఇంకా ఈ సానుభూతి డ్రామాలు దేనికి? అంటే లోక్‌సభ ఎన్నికల కోసమే!

పక్కనే ఉన్న శాసనసభకు రాలేరు కానీ దూరంగా ఉన్న నల్గొండ సభకు వెళ్ళగలరు. పైగా మేడిగడ్డ బ్యారేజిలో రెండు మూడు పిల్లర్లు క్రుంగితే తప్పు కాదని నిసిగ్గుగా సమర్ధించుకుంటున్నారు కూడా. ఆయనకు తప్పులు చేయడం, అవినీతికి పాల్పడటం అలవాటే కనుక ఏదీ తప్పుగా అనిపించదు. అందుకే వేల కోట్లు ఖర్చు చేసిన మేడిగడ్డ బ్యారేజి క్రుంగిపోతున్న సమర్ధించుకుంటున్నారు,” అని సిఎం రేవంత్‌ రెడ్డి నిప్పులు చెరిగారు.


Related Post