మన పీవీకి భారతరత్న... శభాష్... శభాష్!

February 09, 2024


img

మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహరావుకి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న అవార్డును ప్రకటించింది. ఇది తెలుగు ప్రజలందరికీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరికీ చాలా సంతోషకరమైన విషయమే. 

పీవీ 2004, డిసెంబర్‌ 3న చనిపోయారు. తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కున్న భారత్‌ని పీవీ కాపాడారు. కనుక అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఈ అవార్డు ఇస్తుందని అందరూ ఆశించారు. కానీ చనిపోయిన తర్వాత ఆయన భౌతిక కాయాన్ని కూడా గౌరవించకుండా చాలా దారుణంగా అవమానించింది. చివరికి ఆయన అంత్యక్రియలు సైతం సరిగ్గా నిర్వహించకపోవడం తెలుగు ప్రజలందరికీ చాలా బాధ కలిగించింది.

ఆ బాధని మరపిస్తూ మోడీ ప్రభుత్వం మహోన్నతమైన మన పీవీకి ప్రతిష్టాత్మకమైన భారతరత్న అవార్డుతో గౌరవించింది. అది ఏ కారణంతో ఇచ్చినప్పటికీ చేసింది చాలా మంచి పనే కనుక అభినందించాల్సిందే. సంతోషించాల్సిందే. 

స్వయంగా మంచి రచయిత అయిన పీవీ జీవితం తెరిచిన పుస్తకం వంటిదిదే. నిరాడంబరమైన ఆయన జీవనశైలి, చాణక్యుడికి మించిన తెలివితేటలు, రాజకీయ చతురత, మేదస్సు, బహుబాషా ప్రావీణ్యత వంటివన్నీ అందరికీ తెలుసు.  

పీవీ నరసింహరావు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా, భీమదేవరపల్లి మండలంలోని వంగర గ్రామానికి చెందినవారు. కాంగ్రెస్ పార్టీతో జీవితం ప్రారంభించి కాంగ్రెస్‌లోనే ముగించుకున్నారు. 1957లో శాసనసభ ఎన్నికలలో తొలిసారిగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత వరుసగా 1962, 67, 72 ఎన్నికలలో విజయం సాధించారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వివిద శాఖలకు మంత్రిగా చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా చేశారు. 1977లో హనుమకొండ నుంచి లోక్‌సభకు పోటీ చేసి గెలవడంతో ఆయన రాజకీయ జీవితంలో మరో మెట్టు ఎక్కారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేసి తన సమర్ధతను నిరూపించుకున్నారు. ఆ తర్వాత అనూహ్యంగా 1991లో పీవీ ప్రధానమంత్రి పదవి చేపట్టారు. 

పూర్తి మెజార్టీ కూడా లేని ప్రభుత్వం ఏ క్షణంలో కూలిపోతుందో తెలీని పరిస్థితి. పైగా భారత్‌ తీవ్ర ఆర్ధిక సంక్షోభం నెలకొంది. ఈ పరిస్థితిలో కూడా పీవీ చాలా నిబ్బరంగా, తెలివిగా ప్రభుత్వాన్ని ఐదేళ్ళు విజయవంతంగా నడిపిస్తూ, దేశాన్ని ఆర్ధిక సంక్షోభం నుంచి కూడా గట్టెకించారు.

పీవీ-డా.మన్మోహన్ సింగ్ కాంబినేషన్‌లో చేసిన ఆర్ధిక సంస్కరణలే దేశ భవిష్యత్‌కు బలమైన పునాది వేశాయి. అటువంటి మహనీయుడు, మన తెలుగు, తెలంగాణ బిడ్డడికి ఇంత ఆలస్యంగానైనా తగిన గౌరవం, గుర్తింపు లభించడం చాలా సంతోషం.


Related Post