తాటికొండ రాజయ్య.. పార్టీకి గుడ్ బై!

February 03, 2024


img

స్టేషన్‌ ఘన్‌పూర్‌ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఈరోజు బిఆర్ఎస్ పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికిప్పుడు పార్టీని వీడబోనని, మారబోనని చెప్పారు.

తన అనుచరులతో, నియోజకవర్గం ప్రజలతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. కానీ కేసీఆర్‌ని ఇంత తీవ్రంగా విమర్శించిన తర్వాత పార్టీలో కొనసాగడం ఇబ్బందికరంగా మారుతుందని గ్రహించిన్నట్లే ఉన్నారు. అందుకే పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించేశారు. 

పార్టీలో తనకు గుర్తింపు, గౌరవం లేదని, తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నానని చెప్పుకొచ్చారు. గతంలో తాను కాంగ్రెస్ పార్టీలో పనిచేసినందున ఆ పార్టీ నేతలతో తనకు మంచి పరిచయాలున్నాయంటూ అసలు విషయం చెప్పకనే చెప్పారు. 

అయితే కేసీఆర్‌ రెండుసార్లు మంచి అవకాశాలు ఇచ్చినా రాజయ్య వాటిని సద్వినియోగపరుచుకోకపోవడం వలననే నేడు ఈ దుస్థితి ఎదురైందని చెప్పవచ్చు. మొదట ఆయనకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి పదవి, కీలకమైన వైద్య ఆరోగ్యశాఖని ఇచ్చారు. కానీ అంబులెన్సుల కుంభకోణానికి పాల్పడినందుకు కేసీఆర్‌ ఆయనని పదవిలో నుంచి తొలగించారు.

అయినా ఎదురు తిరగకుండా విధేయంగా ప్రవర్తించినందుకు మళ్ళీ ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చారు. కానీ ఈసారి ఓ మహిళా అధికారిని లైంగిక వేధింపులకు పాల్పడి బిఆర్ఎస్ పార్టీకి తీరని అప్రదిష్ట కలిగించారు.

అందుకే కేసీఆర్‌ ఈసారి శాసనసభ ఎన్నికలలో రాజయ్యన్ని పక్కన పెట్టారని అందరికీ తెలుసు. కనుక బిఆర్ఎస్ పార్టీలో గౌరవం లభించలేదనే రాజయ్య ఆరోపణలు అవాస్తవమే. 


Related Post