జాబ్ నోటిఫికేషన్స్ జారీ పక్కా! ఎందువల్ల అంటే...

January 27, 2024


img

ఫిబ్రవరి నెలాఖరులోగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడితే మళ్ళీ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసేవరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. కనుక ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ జారీ చేసేందుకు వీలుండదు. 

ఇదీగాక కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే జాబ్ క్యాలండర్ ప్రకటించి దాని ప్రకారం ఉద్యోగాల భర్తీ చేస్తుందని ఎన్నికలలో హామీ ఇచ్చింది. దాని ప్రకారం ఫిబ్రవరి 1 నుంచి డిసెంబర్‌ 15లోగా రాష్ట్రంలో రెండు లక్షల ప్రభుత్వోద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. 

కనుక ఆ హామీ అమలుచేయడం కోసమైనా తక్షణమే జాబ్ నోటిఫికేషన్స్ జారీ చేయకతప్పదు. లేకుంటే లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు ఈ హామీ గురించి కూడా ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించకమానదు. 

ఈ విషయం దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా నోటిఫికేషన్స్ జారీ చేయాల్సి ఉంటుంది. కనుక ఉద్యోగాల భర్తీకి ఆర్ధికశాఖ తక్షణం అనుమతులు మంజూరు చేయాలని సిఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరో 5-6,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సిఎం రేవంత్‌ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. 

టిఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. కనుక వీలైనంత త్వరగా పాలకమండలి సభ్యులను కూడా నియమించి, నోటిఫికేషన్స్ జారీ చేయించాలని సిఎం రేవంత్‌ రెడ్డి భావిస్తున్నారు. 

కనుక కారణాలు ఏవైనప్పటికీ త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం డీఎస్సీ, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ జారీ చేయడం ఖాయమనే భావించవచ్చు.                       



Related Post