మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, బిఆర్ఎస్ నేతలు ఎంతో గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజిలో కొంతభాగం క్రుంగిపోవడంతో వారు సంజాయిషీ చెప్పుకోలేని స్థితిలో ఉన్నారిప్పుడు.
దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో విజిలెన్స్ అధికారులు ప్రాజెక్టుకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని, సంబంధిత అధికారులను ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐ విచారణ జరిపేందుకు సిట్టింగ్ జడ్జిని కేటాయించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ వ్రాసింది. మరో పక్క దీనిపై సీబీఐ చేత విచారణ జరిపించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
దీనిపై హైకోర్టులో సీబీఐ కూడా కౌంటర్ దాఖలు చేసింది. దానిలో తాము కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ జరిపేందుకు సిద్దంగా ఉన్నామని పేర్కొంది. అయితే ఇంతవరకు తమకు ఎవరూ ఫిర్యాదు చేయనందున జోక్యం చేసుకోలేదని తెలిపింది. ఒకవేళ హైకోర్టు లేదా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన్నట్లయితే దర్యాప్తు చేసేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపింది.
అయితే దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన సదుపాయాలతో పాటు ఒక అదనపు ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, నలుగురు ఎస్పీలు, ఆరుగురు సబ్ ఇన్స్పెక్టర్లతో పాటు అవసరమైన సిబ్బందిని కేటాయించవలసి ఉంటుందని సీబీఐ తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు ఫిబ్రవరి 2కి వాయిదా వేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టుతోనే కేసీఆర్, బిఆర్ఎస్ ప్రభుత్వానికి గొప్ప పేరు వచ్చింది. కానీ ఇప్పుడు అదే ప్రాజెక్టు వారి మెడకు ఉచ్చులా బిగుసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ కేసు సీబీఐ చేతిలోకి వెళితే, ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేంద్రం చేతిలో చిక్కుకున్న బిఆర్ఎస్, ఇప్పుడు మరో కేసుతో దాని చిక్కుకున్నట్లే అవుతుంది. అప్పుడు మోడీ, అమిత్ షాలు ఆడించిన్నట్లు బిఆర్ఎస్ ఆడవలసి ఉంటుంది.
ఓ పక్క కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న కేసులు, మరో పక్క సీబీఐ ద్వారా కేంద్రం ఒత్తిళ్ళు భరించాలంటే చాలా కష్టమే. మరి కేసీఆర్ ఎలా నెగ్గుకు వస్తారో?