కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పధకాలలో ఒకటైన మహాలక్ష్మి పధకంలో భాగంగా అర్హులైన మహిళలకు నెలకు రూ.2.500 పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీలు అమలుచేయాలంటూ ఓ వైపు బిఆర్ఎస్ పార్టీ ఒత్తిడి, మరోవైపు ముంచుకొస్తున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నెల నుంచే ఈ మహాలక్ష్మి పధకాన్ని కూడా అమలుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే గృహ జ్యోతి పధకం కింద 200 లోపు యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా హామీని కూడా వచ్చే నెల నుంచే అమలుచేయబోతున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.
ఇప్పటికే ఆరు గ్యారంటీ పధకాలలో మహాలక్ష్మి పధకం కింద రాష్ట్రంలో మహిళలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఆరోగ్య శ్రీ వైద్య సేవల పరిమితిని రూ.10 లక్షలకు పెంచింది. ఇప్పుడు ఈ రెండు పధకాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేసేందుకు సిద్దమవుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా పది రోజులపాటు ప్రజా పాలన ఆరు గ్యారంటీ పధకాలకు వచ్చిన దరఖాస్తులలో అత్యధికంగా ఈ మహాలక్ష్మి పధకానికే వచ్చాయి. కనుక లోక్‌సభ ఎన్నికలలోగా ఈ పధకం ద్వారా మహిళల ఖాతాలలో నెలకు రూ.2,500 చొప్పున ప్రభుత్వం జమా చేయగలిగితే, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఏర్పడి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తారని భావిస్తున్నారు. కనుక ఎట్టి పరిస్థితులలో ఈ పధకాలను లోక్‌సభ ఎన్నికలకు ముందే అమలుచేసే అవకాశం ఉందని భావించవచ్చు.