వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం వ్యూహం సినిమాకు తెలంగాణ హైకోర్టులో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. సినిమా విధించిన స్టే ఉత్తర్వులను మరో మూడు వారాలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు... ఈ సినిమాని మళ్ళీ మరోసారి చూసి సెన్సార్ చేసి రిపోర్ట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డుని ఆదేశించింది.
దీంతో రాంగోపాల్ వర్మకు, ఆయన ఈ సినిమా తీయించి టిడిపి, జనసేనలను ఎన్నికలలో దెబ్బ తీయాలనుకున్న వైసీపిల వ్యూహం బెడిసికొట్టిన్నట్లయింది. డిసెంబర్‌లో ఈ సినిమా విడుదల చేసి, శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలోగా మరోటి కూడా విడుదల చేసి టిడిపి, జన సేనలను ఎన్నికలలో చావు దెబ్బ తీయాలనుకుంటే, కనీసం మొదటి సినిమా కూడా విడుదల చేయలేని దుస్థితి ఏర్పడింది.
ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బ తీయడానికి ఇటువంటి వ్యూహాల పేరుతో ఇటువంటి కుట్రలుచేస్తూ, మళ్ళీ సంక్షేమ పధకాల నిధుల విడుదల సభలలో తాను ఆణిముత్యం వంటివాడినని, రాష్ట్రంలో పేద ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన తప్ప తనకు మరో ఆలోచనే లేదని చెప్పుకుంటారు.
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, దగ్గుబాటి పురందేశ్వరి, ఇప్పుడు సొంత చెల్లెలు వైఎస్ షర్మిల వంటివారందరూ తనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తుంటారు.
రాష్ట్ర విభజన తర్వాత అభివృద్ధిలో దూసుకుపోవలసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత పదేళ్ళుగా ఇలాంటి రాజకీయాలే జరుగుతున్నాయి. పార్టీల తీరు కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి దయనీయంగా మారగా, ఆ రాష్ట్ర ప్రజలు నాలుగు పార్టీల మద్య నలిగిపోతూనే ఉన్నారు.