దివంగత ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఖలిస్తానీ తీవ్రవాదులను మట్టుపెట్టారు. చివరికి ఆమె కూడా బలయ్యారు. అప్పటి నుంచి దేశంలో మళ్ళీ ఖలిస్తాన్ అనే మాట కూడా వినపడలేదు.
కానీ కెనడా నుంచి ఖలిస్తానీ వేర్పాటువాదులను ప్రోత్సహిస్తున్నారనే కారణంగా గురు పత్వంత్ సింగ్ పన్నూని భారత్ ప్రభుత్వం రహస్యంగా హత్య చేయించేందుకు కుట్ర పన్నిందంటూ కెనడా ప్రధాని ఆరోపణలతో ఇరుదేశాల మద్య పెద్ద దౌత్యయుద్ధమే జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది.
అది ఇంకా కొనసాగుతుండగానే యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటిఎస్) పోలీసులు శుక్రవారం ముగ్గురు ఖలిస్తానీ సానుభూతిపరులను అరెస్ట్ చేశారు. వారు గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నట్లు ఏటిఎస్ పోలీసులు అనుమానిస్తున్నారు.
వారి అరెస్టుపై బహుశః కెనడా నుంచి పన్నూ ఓ హెచ్చరిక సందేశం పంపించాడు. దానిలో అతను ఏటిఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన ముగ్గురినీ వేదిస్తే అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రతిష్ట రోజున విధ్వంసం సృష్టిస్తామని, యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాధ్ ని హత్య చేస్తామని బెదిరించాడు.
గణ తంత్ర దినోత్సవం నాడు పంజాబ్ ముఖ్యమంత్రి భగవాన్ మాన్‌ని కూడా హత్య చేస్తామని ఆ వీడియో సందేశంలో హెచ్చరించాడు.
ఈ నెల 22న అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట, నాలుగు రోజుల తర్వాత ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా గణ తంత్ర దినోత్సవ వేడుకలు జరుగబోతున్నాయి. కనుక యూపీ, పంజాబ్ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమయ్యాయి.