మహేష్ బాబు గుంటూరు కారం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో సినిమా చేయబోతున్నారు. రాజమౌళి సినిమా అంటే కనీసం 3-4 ఏళ్ళు పడుతుంది. కనుక అంతవరకు మహేష్ బాబు మరో సినిమా చేయలేరు. కనీసం వాణిజ్య ప్రకటనలలో కూడా నటించడానికి వీలులేదు.
అలాగే షూటింగ్ జరుగుతున్నంత కాలం మీడియాకు, అభిమానులకు దూరంగా ఉండాలి. బయట ఎక్కడా ఫోటోలు దిగకూడదు. ఒకవేళ దిగినా వాటిని మీడియా, సోషల్ మీడియాలో షేర్ చేయకూడదు.
ఇలాంటి షరతులు ఇంకా చాలానే అగ్రిమెంటులో ఉన్నాయి. కనుక మహేష్ బాబు త్వరలోనే తెలుగు ప్రేక్షకులకు, అభిమానులకు కనిపించకుండా మాయం కాబోతున్నారు. మళ్ళీ రాజమౌళి సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాతే ఏదైనా! ఇది అభిమానులకు చాలా కష్టంగానే ఉంటుంది.
ఇండస్ట్రీలో ఒక్క పెద్ద స్టార్ 3-4 ఏళ్ళపాటు సినిమాలు చేయడం మానుకుంటే, ఆ సమయంలో మిగిలిన నటులకు, చాలా ‘స్పేస్’ లభిస్తుంది. ముఖ్యంగా దసరా, దీపావళి, సంక్రాంతి పండుగల సీజన్‌లో మరో 3-4 ఏళ్ళ వరకు మహేష్ బాబు నుంచి పోటీ ఉండదు. కనుక ముఖ్యంగా చిన్న సినిమాలకు మరిన్ని థియేటర్లు లభిస్తాయి. అయితే మహేష్ బాబు ఈ 3-4 ఏళ్ళు ఖాళీగా వదిలేస్తున్న ఈ ‘స్పేస్’ని ఇండస్ట్రీలో ఎవరు అందిపుచ్చుకుని లాభపడతారో చూడాలి.