ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డితో ఆస్తులు, పదవుల పంపకంలో గొడవపడి తెలంగాణ రాజకీయాలలో నాటకీయంగా ప్రవేశించిన వైఎస్ షర్మిల ఎట్టకేలకు ఆమె స్వరాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్ళిపోతున్నారు. ఆమెను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమిస్తున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.
దీంతో ఇంతకాలం తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపించి ప్రజలను, రాష్ట్రాన్ని ఉద్దరిస్తానని చెప్పిన వైఎస్ షర్మిల, అందరికీ టాటా...బైబై చెప్పేసి త్వరలో ఆంధ్రాకు వెళ్ళిపోతున్నారు. మరి తెలంగాణ ప్రజల కోసమే రాజకీయాలలో వచ్చానని వారి కోసం పోరాడుతూనే ఉంటానని ప్రజలకు ఇచ్చిన వాగ్ధానం సంగతి వైఎస్ షర్మిల పక్కన పెట్టేటేయక తప్పదు.
గతంలో ఆమె అన్న జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు వైఎస్ షర్మిల ఇద్దరూ కూడా తమను నమ్ముకుని వెంట తిరిగిన నాయకులను, కార్యకర్తలను నడిరోడ్డున విడిచిపెట్టేశారు.
అయితే వైఎస్ షర్మిల ఏపీలో అడుగుపెడుతూనే ముందుగా తన సొంత అన్న ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డిపైనే కత్తులు దూయాల్సి ఉంటుంది. ఆయన ప్రభుత్వ విధానాలను, పాలనపై విమర్శలు గుప్పించాల్సి ఉంటుంది.
అలాగే ఏపీలో చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బ్రతికించుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచే నేతలు, కార్యకర్తలను ఆకర్షించాల్సి ఉంటుంది కనుక ఆమె వలన జగన్మోహన్ రెడ్డికి, వైసీపికి తీవ్ర ఇబ్బందులు తప్పవు. కనుక జగన్మోహన్ రెడ్డి నుంచి కూడా ఆమెకు తీవ్ర ఇబ్బందులు, సవాళ్ళు తప్పవు.
కాంగ్రెస్ అధిష్టానం ఏపీలో టిడిపి పట్ల సానుకూలంగా ఉంది. కనుక ఆమె టిడిపి, జనసేనలతో నేరుగా పొత్తులు పెట్టుకొనప్పటికీ, వాటికి అపకారం తలపెట్టకుండా, త్వరలో జరుగబోయే శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో వాటితో పరస్పరం సహకరించుకుంటూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవలసి ఉంటుంది. ఇది కూడా ఆమె సోదరుడు జగన్మోహన్ రెడ్డికి, వైసీపికి చాలా ఇబ్బందికరమైన పరిణామమే అవుతుంది.
కనుక వైఎస్ షర్మిల ఏపీలో ప్రవేశించగానే అన్నా చెల్లెళ్ళ మద్య యుద్ధం మొదలవడం ఖాయమే. వీరి తల్లి విజయమ్మ ఇద్దరి యుద్ధాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలువబోతున్నారు. ఆమె ఇటువంటి పరిణామాలు ఊహించి ఉండరు కనుక ఆమె ఈ పరిణామాలు జీర్ణించుకోవడం చాలా కష్టమే. ఇప్పుడు ఆమె కొడుకు, కూతుర్లలో ఎవరి వైపు నిలుస్తారో?