అద్దంకి, కోదండరామ్‌లకు ఎమ్మెల్సీ సీట్లు ఖరారు?

January 14, 2024


img

తెలంగాణలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయడానికి ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడినందున కాంగ్రెస్‌ అధిష్టానం ముందుగా ఆ రెండు స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసేందుకు సిఎం రేవంత్‌ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌లతో శుక్రవారం రాత్రి చర్చించింది.

రాహుల్ గాంధీ శాసనసభ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో పర్యటించినప్పుడే టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌, కాంగ్రెస్‌ సీనియర్ నేత అద్దంకి దయాకర్‌లకు ఎమ్మెల్సీ సీట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కనుక ఈ రెండు సీట్లకు వారి పేర్లను ఖరారు చేసిన్నట్లు తెలుస్తోంది. 

తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నేతలలో పలువురు రేవంత్‌ రెడ్డి నాయకత్వాన్ని, ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పుడు ఒక్క అద్దంకి దయాకర్ ఒక్కరే రేవంత్‌ రెడ్డికి గట్టిగా మద్దతు పలికారు. శాసనసభ ఎన్నికలలో ఆయనకు టికెట్‌ ఇవ్వనప్పటికీ కాంగ్రెస్‌ గెలుపు కోసం చాలా కష్టపడి పనిచేశారు. కనుక సిఎం రేవంత్‌ రెడ్డి ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్‌ అధిష్టానంతో మాట్లాడి ఒప్పించిన్నట్లు తెలుస్తోంది. 

ప్రొఫెసర్ కోదండరామ్‌ కూడా రేవంత్‌ రెడ్డి కష్టకాలంలో అండగా నిలబడ్డారు. ముఖ్యంగా శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం గట్టిగా కృషి చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్య నేతలందరితో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. కనుక ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వాల్సిందిగా సిఎం రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ అధిష్టానాన్ని కోరారు. 

ఈరోజు రాత్రి సిఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీ నుంచి దావోస్ పర్యటనకు బయలుదేరబోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో నామినేషన్స్ వేసేందుకు ఈనెల 18 వరకే గడువు ఉంది. కనుక ఈరోజు సాయంత్రంలోగా అద్దంకి దయాకర్, ప్రొఫెసర్ కోదండరామ్‌ల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. 

ఈ రెండు స్థానాలు ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికలు జరుగుతాయి కనుక పోటీ లాంఛనప్రాయమే. కాంగ్రెస్‌ అధిష్టానం ఎవరిని అభ్యర్ధులుగా ప్రకటిస్తే వారు ఎమ్మెల్సీలుగా ఎన్నికైన్నట్లే! 

ఈ రెండు స్థానాలకు జనవరి 18వరకు నామినేషన్స్‌ సమర్పించాల్సి ఉంటుంది. జనవరి 19న నామినేషన్స్‌ పరిశీలన, వాటి ఉపసంహరణకు 22వరకు గడువు ఉంటుంది. జనవరి 29వ తేదీన పోలింగ్‌ నిర్వహించి, అది ముగియగానే ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.


Related Post