కేసీఆర్‌ను, తెలంగాణను ఎవరూ వేరు చేయలేరు: హరీష్

January 12, 2024


img

మాజీ మంత్రి హరీష్ రావు ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలో మనోహరాబాద్ మండలంలో జీడిపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “తెలంగాణ కోసం కేసీఆర్‌ చావు నోట్లో తలపెట్టి పోరాడి సాధించుకున్నారు. ఆయన వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశారు. అనేక సంక్షేమ పధకాలు అమలుచేశారు. అనేక ప్రాజెక్టులు నిర్మించి రాష్ట్రానికి నీటి కరువు శాశ్వతంగా తీర్చారు. 

కేసీఆర్‌ అంటే తెలంగాణ... తెలంగాణ అంటే కేటీఆర్‌. ఈ రెంటినీ ఎవరూ వేరు చేయలేరు. కేసీఆర్‌ తెలంగాణ ప్రయోజనాల కోసం ఢిల్లీ పాలకులతో కొట్లాడివస్తే, కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీ పెద్దలకు దండాలు పెట్టేందుకు ఢిల్లీ వెళ్ళివస్తున్నారు. 

కాంగ్రెస్‌ నేతలు నోటికి వచ్చినట్లు హామీలు ఇచ్చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వాటన్నిటినీ అమలుచేయలేక అప్పులు, శ్వేత పత్రాలు అని అంటున్నారు,” అంటూ హరీష్ రావు ఇంకా చాలా విమర్శలు చేశారు.

తెలంగాణ, కేసీఆర్‌లను ఎవరూ వేరుచేయలేరని హరీష్ రావు చెప్పడం చాలా హాస్యస్పదంగా ఉంది. నిజానికి కేసీఆర్‌ స్వయంగా టిఆర్ఎస్‌ పేరుని బిఆర్ఎస్‌గా మార్చుకుని తెలంగాణ నుంచి తనకు తానే వేరు పడ్డారు కదా? జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనే ఆలోచనతో పార్టీలో ‘తెలంగాణ’ అనే పదాన్ని తొలగించుకుని ‘భారత్‌’ అని పెట్టుకున్నారు కదా?

కానీ అది పొరపాటని ఇప్పుడు గ్రహించి మళ్ళీ బిఆర్ఎస్‌ని టిఆర్ఎస్‌గా మార్చుకోవాలని పార్టీలో ఆలోచనలు జరుగుతున్నాయి. అప్పుడు ప్రజలకు, కాంగ్రెస్‌, బీజేపీలకు సంజాయిషీ ఇచ్చుకోవలసి ఉంటుంది. కనుక కేసీఆర్‌ని తెలంగాణను ఎవరూ విడదీయలేరంటూ చెప్పుకోవడం మొదలుపెట్టిన్నట్లున్నారు.


Related Post