తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధిని కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగించగలదా?

January 12, 2024


img

ఎవరు అవునన్నా కాదన్నా గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రానికి అనేక పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు, జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు, లక్షల కోట్ల పెట్టుబడులు ప్రవాహంలా వచ్చేవి. ఆ కారణంగా లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి లభించాయి.

ఈ కారణంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, రవాణా, హోటల్‌ తదితర రంగాలు కూడా సమాంతరంగా అభివృధ్ది చెందాయి. వీటన్నితో రాష్ట్ర ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. 

మాజీ ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌, ఆయన బృందానికే ఈ క్రెడిట్ దక్కుతుంది. వారి దూరదృష్టి, పట్టుదల, కృషి వలన తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక, ఐ‌టి రంగాలలో చాలా అభివృద్ధి చెందింది.

అయితే ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఇంకా నెల రోజులే అయినందున అప్పుడే పారిశ్రామికాభివృద్ధి గురించి ప్రభుత్వాన్ని నిలదీయడం సబబు కాదు. కానీ ఈ విషయంలో బిఆర్ఎస్ ప్రభుత్వం చూపిన చొరవ, చురుకుదనం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చూపుతుందా (చూపగలదా) లేదా? లేకపోతే తెలంగాణ పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నలు వినపడుతున్నాయి.     

కేటీఆర్‌ స్థానంలో ఇప్పుడు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్‌లో వందల ఎకరాలలో ఫార్మా సిటీని నిర్మించడం కంటే పది చిన్న చిన్న ఫార్మా సిటీలను నిర్మించడం మంచిదని సిఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్ధిక సదస్సుకు సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు వెళ్ళబోతున్నారు. కనుక పారిశ్రామికాభివృద్ధి విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిందని, నిర్ధిష్టమైన ఆలోచనలు ఉన్నాయని భావించవచ్చు. 

గూగుల్ ఇండియా వైస్-ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట గురువారం సిఎం రేవంత్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు. అమెరికాకు చెందిన మెమొరీ చిప్స్ తయారీ సంస్థ మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్, సీఈవో సంజయ్ మెహ్రోత్రా కూడా సిఎం రేవంత్‌ రెడ్డిని కలిసి తెలంగాణలో పెట్టుబడులకు సిద్దంగా ఉన్నామని చెప్పారు. 

ఇదివరకు బిఆర్ఎస్ హయాంలో నిత్యం పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు, పెట్టుబడులకు సంబందించి వార్తలు వస్తుండేవి. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పారిశ్రామికాభివృద్ధికి సంబందించి వార్తలు రావడం ఇదే మొదటిసారి. కనుక బిఆర్ఎస్ ప్రభుత్వం అందించిన అభివృద్ధిని కాంగ్రెస్‌ ప్రభుత్వం అందుకుని మరింత వేగంగా ముందుకు తీసుకువెళుతుందని ఆశిద్దాం.


Related Post