తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో బుధవారం సుదీర్గంగా సమీక్షా సమావేశం జరిపారు. దీనిలో మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి, విద్యుత్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి “గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో అవకతవకలు జరిగాయా లేదా?” అంటూ అధికారులను సూటిగా ప్రశ్నించారు.
ఒకవేళ మార్కెట్ రేటు కంటే ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసి ఉంటే ఆ విదంగా ఎందుకు కొనుగోలు చేశారు?దాని కోసం ఎంత చెల్లించారు?గత పదేళ్ళలో బయట నుంచి అదనంగా ఎంత విద్యుత్ కొన్నారు? రాష్ట్రంలో విద్యుత్ ఎంత ఉత్పత్తి అవుతోంది?
రాష్ట్రంలో 24 గంటలు విద్యుత్ సరఫరాకు ఎంత విద్యుత్ అవసరం? దాని కోసం బయట నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం మంచిదా లేక రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్స్ ఏర్పాటు చేసుకోవడం వలన దీర్గ కాలంలో లాభమా? అంటూ సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు విద్యుత్ అధికారులను ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సమగ్రమైన నివేదిక ఇవ్వాలని సిఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
కాంగ్రెస్ హామీలో ఒకటైన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వంపై ఎంత అదనపు భారం పడుతుందో, దానిని అమలుచేయడానికి విధివిధానాలను రూపొందించి నివేదిక రూపంలో సమర్పించాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
విద్యుత్ ఉత్పత్తి, కొనుగోలు, సరఫరా తదితర అంశాలన్నిటిపై నిపుణులతో చర్చించి సలహాలు తీసుకున్నాక విద్యుత్ పాలసీని ప్రకటించి దానిపై శాసనసభలో కూడా చర్చిస్తామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు.