హమ్మయ్య షర్మిల కాంగ్రెస్‌లో చేరిపోయారు!

January 04, 2024


img

అన్న జగన్మోహన్‌ రెడ్డితో విభేదించి తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకొని రాజన్న రాజ్యం స్థాపిస్తానంటూ కాళ్ళు అరిగిపోయేలా పాదయాత్ర చేసిన వైఎస్ షర్మిల, ఎట్టకేలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.

భర్త అనిల్ కుమార్‌తో కలిసి ఢిల్లీకి వెళ్ళిన వైఎస్ షర్మిల, అక్కడ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఆమె స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ దుకాణం కూడా బంద్ అయిపోయిన్నట్లే!  

ఆమె తెలంగాణ కాంగ్రెస్‌లో చేరాలనుకొన్నప్పటికీ సిఎం రేవంత్‌ రెడ్డి అందుకు అంగీకరించకపోవడంతో కాంగ్రెస్‌ అధిష్టానం సూచన మేరకు ఆమె ఏపీ కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. అయితే ఆమెకు ఏపీ కాంగ్రెస్‌ పగ్గాలు అప్పగిస్తుందా లేక వేరేదైనా బాధ్యతలు అప్పగిస్తుందా? అనేది ఇంకా తెలియవలసి ఉంది. 

ఆమె ఏపీ కాంగ్రెస్‌లోకి వెళ్ళిపోతే ఆమె నుంచి తెలంగాణ ప్రజలకు, పార్టీలకు కూడా ‘రాజకీయ విముక్తి’ లభిస్తుంది. కానీ ఏపీలో అడుగు పెట్టగానే ఆమె మొట్టమొదట తన సొంత అన్న జగన్మోహన్‌ రెడ్డిపైనే కత్తి దూసి యుద్ధం ప్రారంభించవలసి ఉంటుంది. కనుక ఇద్దరికీ ఇబ్బందిగానే ఉంటుంది.

ఆమె రాకతో అధికార వైసీపి తీవ్రంగా నష్టపోయే ప్రమాదం కూడా పొంచి ఉంది. కనుక ఈ సమస్య నుంచి ఏవిదంగా బయటపడాలని కేసీఆర్‌ సలహా తీసుకొనేందుకే జగన్మోహన్‌ రెడ్డి ఈరోజు పరామర్శ పేరుతో కేసీఆర్‌తో భేటీ కాబోతున్నారు. 


Related Post