రేవంత్‌ ప్రభుత్వానికి హరీష్ రావు తీపి కబురు!

December 31, 2023


img

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు ఓ శుభవార్త చెప్పారు. అయితే ఆయన ఓ ఉద్దేశ్యంతో ఈ విషయం చెప్పినప్పటికీ మరో విదంగా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి ఆయన శుభవార్త చెప్పిన్నట్లే అయ్యింది. 

ఇంతకీ హరీష్ రావు ఏమన్నారంటే, “కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల అమలుకి మూడు నెలల గడువు కోరింది. అది మార్చి 17తో పూర్తవుతుంది. కానీ ఫిబ్రవరి నెలాఖరులోగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. అప్పుడు ఆరు గ్యారెంటీలను వాటిలో పేర్కొన్న 13 హామీలను ఏవిదంగా నెరవేరుస్తారు? 

బహుశః అందుకే దరఖాస్తుల స్వీకరణ పేరుతో అప్పటి వరకు కాలక్షేపం చేసేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోంది. కనుక కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఆరు గ్యారెంటీలను అమలుచేయాలనే చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఫిబ్రవరిలోగానే పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టి వాటికి నిధులు కేటాయించాలి. అలాగే ఫిబ్రవరి నెలాఖరులోగా ఆరు గ్యారెంటీలకు మార్గదర్శకాలు విడుదల చేయాలి,” అని అన్నారు. 

హరీష్ రావు చెప్పిన్నట్లు బహుశః కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కూడా మార్చిలో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని తెలిసే ఉండవచ్చు. ఒకవేళ తెలియకపోతే హరీష్ రావు ఎలాగూ గుర్తు చేశారు. కనుక లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి ఆరు గ్యారెంటీలను అమలుచేయడానికి మరో మూడు నెలలు గ్రేస్ పీరియడ్ లభించిన్నట్లే. ఈ శుభవార్త చెప్పినందుకు హరీష్ రావుకి కాంగ్రెస్‌ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుకోవలసిందే.


Related Post