ఊహించిన్నట్లే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీ పధకాల భారం తగ్గించుకోవడానికి మెలికలు పెడుతోంది. మహాలక్ష్మి పధకం క్రింద రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తామని ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు ఇస్తామని చెప్పలేదు. ఇస్తుందని ఎవరూ ఆశించలేదు కూడా. అది సమాజంలో నిరుపేదలకు మాత్రమే అని అందరికీ తెలుసు.
కానీ వారందరికీ ఈ పధకం వర్తింపజేయాలన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా ఆర్ధిక భారం పడుతుంది. కనుక తెల్ల రేషన్ కార్డులు కలిగినవారికే మహాలక్ష్మి పధకం వర్తింపజేయాలని నిర్ణయించింది. ఆ లెక్కన చూసుకున్నా ఒక్క గ్రేటర్ పరిధిలోనే దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలు 30 లక్షలు, వారిలో తెల్ల రేషన్ కార్డులు కలిగినవారు 17.21 లక్షల మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెన్ని లక్షలు మంది ఉన్నారో ఇంకా లెక్క తేలాల్సి ఉంది. కనుక తెలంగాణ ప్రభుత్వానికి ఈ రాయితీ గ్యాస్ బండ భారాన్ని తగ్గించుకోక తప్పడం లేదు.
అందుకే తెల్ల రేషన్ కార్డులతో ముడిపెట్టింది. కనుక రేపటి నుండి ప్రారంభం అయ్యే ప్రజా పాలన గ్రామ సభలలో తెల్ల రేషన్ కార్డుల కోసం భారీగా దరఖాస్తులు రావచ్చు. కనుక వాటిని కూడా పరిమితం చేయక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.