కేసీఆర్ గుళ్ళు గోపురాలు దర్శించడం, యాగాలు చేయడం, కల్వకుంట్ల కవిత బతుకమ్మ ఆడటం వారి వ్యక్తిగత మతవిశ్వాసాలుగానే భావించవచ్చు. కానీ రాజకీయాలు మాట్లాడేటప్పుడు మత ప్రస్తావన తెస్తే దానిని మతరాజకీయ కోణంలోనే చూడాల్సి ఉంటుంది.
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలోనే హిందూమత వ్యతిరేకత ఉంది. రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో గుళ్ళుగోపురాలు దర్శిస్తుంటారు. కానీ సనాతనధర్మంపై ఎవరైనా విమర్శిస్తుంటే మాట్లాడరు. సనాతన ధర్మం గురించి డీఎంకె నేతలు అనుచితంగా మాట్లాడుతున్నప్పుడు వారిని నియంత్రించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి లేదా?అని అడుగుతున్నాను.
రాహుల్ గాంధీ భారత్‌లో అన్ని, ప్రాంతాల, వర్గాల ప్రజలను సమైక్య పరుస్తానంటూ భారత్ జోడో యాత్ర చేశారు. కానీ ఇండియా కూటమిలోని భాగస్వామిగా ఉన్న డీఎంకె నేతలు ఉత్తరాదికి చెందిన హిందీ మాట్లాడేవారు తమ రాష్ట్రంలో టాయిలెట్స్ కడుగుతూ జీవనోపాధి పొందుతున్నారంటూ అవమానకరంగా మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు ఖండించడం లేదు?
కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసగించడం, మభ్యపెట్టడం. కర్ణాటకలో అలాగే చేసి అధికారంలోకి వచ్చింది. ఇక్కడ తెలంగాణలో కూడా అలాగే వచ్చింది. ఆరు గ్యారెంటీలను అమలుచేసేవరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విడిచిపెట్టము,” అని కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.
ఇటీవల కేటీఆర్ శాసనసభలో మాట్లాడుతూ, ‘బీజేపీతో కలుపుకొని మాకు 54 మంది ఎమ్మెల్యేలున్నారు’ అన్నారు. అంటే గత 3-4 ఏళ్లుగా ప్రధాని నరేంద్రమోడీని కేంద్రాన్ని తిట్టిపోస్తున్నా బిఆర్ఎస్ ఇప్పుడు తమ రాజకీయ అవసరాలు, కేసుల నుంచి రక్షణ కోసం బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారా? అనే సందేహం కలుగుతోంది. బహుశః లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడగానే బీజేపీ పట్ల బిఆర్ఎస్ వైఖరి మారిందా లేదా? అనేది స్పష్టం కావచ్చు.