తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, అప్పులపై నిన్న శాసనసభలో కాంగ్రెస్, బిఆర్ఎస్ సభ్యుల మద్య చాలా వాడివేడిగా వాదోపవాదాలు జరుగగా, ఇవాళ్ళ గురువారం రాష్ట్ర విద్యుత్ రంగం పరిస్థితిపై జరుగుతున్న చర్చలో మళ్ళీ రెండు పార్టీల సభ్యులు కత్తులు దూసుకొంటున్నారు. ఇరు వర్గాలు తగ్గేదేలే అన్నట్లు తమ తమ వాదనలు వినిపిస్తున్నారు.
ముందుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నివేదికని సభలో ప్రవేశపెడుతూ, “గత ప్రభుత్వం ఆర్ధిక క్రమశిక్షణ పాటించకుండా నిర్ణయాలు తీసుకొన్నందున నేడు రాష్ట్రంలో డిస్కంలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. రాష్ట్ర విద్యుత్ రంగంపై ఉన్న అప్పులు మొత్తం రూ.81,000 కోట్లుపైనే ఉన్నాయి.
ఈ అప్పులు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.28,843 కోట్లు. వాటిలో ట్రూ అప్ చార్జీల సర్దుబాటు కోసం చెల్లించాల్సింది రూ. 14,928 కోట్లు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సబ్సీడీ కొరకు ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.18,725 కోట్లు. మొత్తం మీద డిస్కంల డెఫిసిట్ (లోటు) రూ.62,496 కోట్లు.
సింగరేణి బొగ్గు గనులకు చాలా దూరంగా యాదాద్రిలో నిర్మిస్తున్న 4,000 మెగావాట్స్ సామర్ధ్యం కలిగిన యాదాద్రి ధర్మల్ విద్యుత్ ఉత్పతి కేంద్రానికి బొగ్గు తరలించడానికే ఏడాదికి సుమారు రూ.800 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ జీవితకాలం 30 ఏళ్ళు అనుకొంటే ఒక్క బొగ్గు రవాణాకే ఎంత ఖర్చు అవుతోందో లెక్కకట్టుకోవచ్చు. అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్యుత్ ప్లాంట్స్ నిర్మించకపోవడం వలన కూడా విద్యుత్ ప్రాజెక్టుల నిర్వహణ వ్యయం, ఆ కారణంగా యూనిట్ విద్యుత్ ఛార్జీలు గణనీయంగా పెరుగుతాయి,” అని భట్టి విక్రమార్క విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ ఆరోపణలకు మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి శాసనసభలో ధీటుగా సమాధానాలు చెపుతున్నారు.