ఈరోజు శాసనసభలో మంత్రి కొండ సురేఖ మాజీ మంత్రి హరీష్ రావుని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కేసీఆర్ ప్రధాని నరేంద్రమోడీతో ఎందుకు గొడవపెట్టుకొన్నారు? కేసీఆర్ మొండి వైఖరి వలన కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టులు నిలిచిపోయాయి కదా?
కేసీఆర్ తన పార్టీ రాజకీయ ప్రయోజనాలనే చూసుకొన్నారు తప్ప దాని వలన తెలంగాణ రాష్ట్రానికి ఎంత నష్టం వాటిల్లుతోందో పట్టించుకోలేదు. చివరికి మోడీని ఆహ్వానించారని త్రిదండి చిన్న జీయర్ స్వామిని కూడా కేసీఆర్ దూరం పెట్టేశారు.
ఆంధ్రా ప్రభుత్వంతో నీటి కోసం గొడవలు పడుతున్నట్లు మీరందరూ నటిస్తుంటారు. కానీ కేసీఆర్, జగన్ ఇద్దరూ ఒకరింటికి మరొకరు వెళ్ళి భోజనాలు చేసి వస్తుంటారు. ఇద్దరి మద్య ఇంత సఖ్యత ఉన్నప్పుడు నీటి కోసం గొడవలు ఎందుకు?
మళ్ళీ మీరు, కేటీఆర్ అందరూ మీడియా ముందుకు వచ్చి ఆంద్రా ప్రభుత్వం ఇలాగా... అలాగా అంటూ విమర్శిస్తుంటారు. ఢిల్లీలో జలవనరుల శాఖ రెండు రాష్ట్రాల నీటి గొడవలను తీర్చేందుకు రమ్మనమని పిలిస్తే కేసీఆర్ ఎన్నిసార్లు వెళ్లారు? ఎంతమందిని పంపించారు?సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించడానికి అవకాశం ఎదురుగా ఉన్నప్పుడూ ఎందుకు అధికారులను పంపించలేదు మీ కేసీఆర్?రాష్ట్ర ప్రయోజనాల కంటే మీ పార్టీ ప్రయోజనాలే ముఖ్యమనుకొన్నారా?
వందల కోట్లు విలువచేసే నిక్షేపంలా ఉన్న పాత సచివాలయాన్ని కూల్పించేసే బదులు దానిని ఆసుపత్రులకు వినియోగించుకోవచ్చు కదా?అలాగే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యులు, నర్సులు కొరత… వైద్య పరికరాల కొరత వేదిస్తుంటే అది పట్టించుకోకుండా సెంట్రల్ జైలు కూల్పించేసి, అక్కడ 22 అంతస్తుల ఆస్పత్రిని నిర్మించాల్సిన అవసరం ఏమిటి? ఈ నిర్ణయాన్ని మీరు ఎలా సమర్ధించుకొంటారు?
మీ కమీషన్ల కక్కుర్తితో నిక్షేపంగా ఉన్నవాటిని కూల్చేసి వేలకోట్లు ఖర్చు చేసి మళ్ళీ కొత్త భవనాలను నిర్మించడం ఏమైనా గొప్పా? ఆస్తులను కూడబెట్టడం అంటే ఉన్నవాటిని కాపాడుకొంటూ కొత్తవాటిని ఏర్పాటు చేసుకోవడమనే చిన్న విషయం మీకు తెలీదా?” అంటూ కొండా సురేఖ దులిపేశారు.