సాధారణంగా శాసనసభ సమావేశాలు వాడీవేడిగా జరుగుతూనే ఉంటాయి. కానీ వాటిలో ఎక్కువగా అధికార, ప్రతిపక్షాల సభ్యుల పరస్పర విమర్శలు, ఆరోపణలే ఎక్కువగా వినిపిస్తుంటాయి.
కనుక సాధారణ ప్రజలు ఎవరూ వాటిపై ఆసక్తి చూపించరు. కానీ ఈరోజు జరిగిన శాసనసభ సమావేశాలలో ఒకవైపు మాజీ ఆర్ధిక మంత్రి హరీష్ రావు ఒకవైపు, సిఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు మరోవైపు నిలిచి గణాంకాలతో సహా తమ వాదనలు వినిపిస్తుంటే చాలా రసవత్తరంగా సాగింది.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, అప్పులపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో విడుదల చేసిన శ్వేతపత్రంపై ఇరు పక్షాల మద్య చాలా అర్దవంతమైన వాదోపవాదాలు జరిగాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ అప్పుల ఆరోపణలపై హరీష్ రావు మాట్లాడుతూ, “తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ తొమ్మిదేళ్ళలో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి దేశంలో నంబర్: 1 రాష్ట్రంగా నిలిపాము. ఒకప్పుడు త్రాగు, సాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కూడా లేని రాష్ట్రంలో అన్నిటినీ సమకూర్చాము.
తెలంగాణ రాష్ట్రంలో ఆర్ధికంగా ఎంతో బలంగా ఉంది కనుకనే ఇంత వేగంగా అభివృద్ధి జరుగుతోంది. కనుకనే రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటి కంపెనీలు తరలివస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఏడాది పొడవునా సాగునీరు అందిస్తున్నాము కనుకనే రాష్ట్రంలో పంట దిగుబడి అనేక రెట్లు పెరిగింది.
మా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం, ఎఫ్ఆర్‌బీఎం నియమనిబందనలకు లోబడే అప్పులు తీసుకొంది. వాటిని తెలంగాణ అభివృద్ధి కోసమే పూర్తిగా వినియోగించాము. ఆ అభివృద్ధి అందరికీ కనబడుతోంది కదా?
మీరు అమలుచేయలేని హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆ హామీలను అమలుచేయకుండా తప్పించుకోవడం కోసమే రాష్ట్రం దివాళా తీసిందని అబద్దాలు చెపుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇంతగా అభివృద్ధి చెందితే, రాష్ట్రం ప్రతిష్ట ఇంతగా పెరిగితే, కొత్తగా అధికారంలోకి వచ్చిన మీరు రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, దివాళా తీసిందని చెపుతూ రాష్ట్రం పరువు, ప్రతిష్ట మంటగలిపేస్తున్నారు.
ప్రభుత్వమే ఇలా చెపుతుంటే ఇంకా రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటి కంపెనీలు వస్తాయా?” అంటూ ఘాటుగా బదులిచ్చారు. ఈ సందర్భంగా హరీష్ రావు పూర్తి గణాంకాలతో సహా తన వాదనలను వినిపించారు.