రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కుటుంబ సభ్యులు కమీషన్ల రూపంలో వేలకోట్లు దోచుకొని అవినీతికి పాల్పడ్డారని పదేపదే ఆరోపించేవారు. మేడిగడ్డ బ్యారేజీలో కొంతభాగం క్రుంగడంతో వారి ఆరోపణలకు బలం చేకూరిన్నట్లయింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం కోసమే వేలకోట్లు ఖర్చు అయ్యింది. దీనిని తానే స్వయంగా దగ్గరుండి డిజైన్ చేయించానని, మంత్రి హరీష్ రావు అక్కడే కుర్చీ వేసుకొని కూర్చొని దగ్గరుండి నిర్మింపజేశానని కేసీఆర్ పదేపదే గొప్పగా చెప్పుకొనేవారు. ఇప్పుడు అదే బిఆర్ఎస్ కొంప ముంచేలా ఉంది.
సిఎం రేవంత్ రెడ్డి, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ప్రాజెక్ట్ నిర్మాణపరమైన లోపాలకు నిర్మాణ సంస్థ ఎల్&టి కంపెనీతో పాటు ప్రాజెక్ట్ అధికారులు కూడా బాధ్యత వహించక తప్పదని ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చిచెప్పేశారు.
సుమారు లక్ష కోట్లకుపైగా ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్టులో లోపాలు వస్తే వాటితో సంబంధం లేదంటూ నిర్మాణ సంస్థ ఓ లేఖ వ్రాసి పడేస్తే చూస్తూ చేతులు ముడుచుకొని కూర్చోబోమని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ ప్రాజెక్టుకి సంబందించి ఖర్చులు, చెల్లింపులు వివరాలు నివేదిక రూపంలో అందజేయాలని ఆదేశించారు.
సిఎం రేవంత్ రెడ్డి దీనిపై మరింత లోతుగా విచారణ జరిపేందుకు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని భావిస్తున్నారు. కనుక ఈ విచారణలు, నివేదికలు, మేడిగడ్డ బ్యారేజీలో క్రుంగిన భాగానికి మరమత్తుల విషయంలో ఎదురయ్యే ఆర్ధిక, న్యాయపరమైన సమస్యలన్నీ చివరికి కేసీఆర్ తలకే చుట్టుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇదే జరిగితే మేడిగడ్డ కాదు బిఆర్ఎస్ పార్టీ క్రుంగిపోయే ప్రమాదం ఉంటుంది.