తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ అయ్యేందుకు మంగళవారం ఢిల్లీ వెళ్ళబోతున్నారు. మంత్రివర్గ విస్తరణ, లోక్‌సభ ఎన్నికలకు పార్టీ అభ్యర్ధులను ఖరారు చేసేందుకు ఢిల్లీ వెళుతున్నట్లు సమాచారం. మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో కలిపి మొత్తం 18 మందికి అవకాశం ఉండగా 11 మందిని మాత్రమే తీసుకొన్నారు. కనుక మరో ఆరుగురికి అవకాశం ఉంది.
మైనార్టీ కోటాలో మంత్రి పదవికి పోటీ పడుతున్నవారిలో నిజామాబాద్ అర్బన్, నామపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్ ఉన్నారు. మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన మైనంపల్లి హన్మంతరావు, అంజన్ కుమార్ యాదవ్, మధు యాష్కీ గౌడ్, గడ్డం వినోద్, గడ్డం వివేక్, మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎల్లారెడ్డి, బోధన్ ఎమ్మెల్యేలు మధన్ మోహన్ రావు, సుదర్శన్ రెడ్డి కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నారు. అయితే మంత్రివర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఇప్పటికే చాలా మంది ఉన్నందున మరొకరిని తీసుకోకపోవచ్చు.
శాసనసభ ఎన్నికలలో ఓడిపోయిన సీనియర్లలో కొందరిని లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయించాలని సిఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. కనుక ఆ విదంగా కొందరిని మంత్రి పదవుల పోటీ నుంచి తప్పించే అవకాశం ఉంది.
సిఎం రేవంత్ రెడ్డి రేపు కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ అయిన తర్వాత ఎవరెవరికి మంత్రివర్గంలో చోటు, లోక్‌సభ టికెట్లు దక్కుతాయో స్పష్టత రావచ్చు. శాసనసభ ఎన్నికలలో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. కనుక లోక్‌సభ ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలుచుకొనేందుకు వీలుగా మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చు.